అక్కడా ఇక్కడా ఒకేసారి!.. ఏంటి సంగ‌తి?

యాదృచ్చికమే కావచ్చు కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, తెరచాటు రాజకీయాల నేపధ్యంలో.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడపలుక్కున్నట్టు ఒకే రోజు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ‘కుచ్ హై క్యా ‘ అనే అనుమానాలు తావిస్తోంది. కొద్దిపాటి విస్మయాన్నికలగ చేస్తోంది. నిజమే, ఈరోజు ఇక్కడ అమరావతిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన.. అక్కడ హైదరాబాద్ ప్రగతి భవన్’లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో కామన్ ఎజెండా ఏమీ లేదు. ఎవరి ఎజెండా వారికుంది, ఎవరి సమస్యలు వారి కున్నాయి. 

అయితే, కేబినెట్ ఎజెండాను పక్కన పెడితే, ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదాలు సహా ఇతర వివాదాలున్నా, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రాజకీయ స్నేహ సంబంధాలు చక్కగానే సాగుతున్నాయి. ఒకరి అవసరాలు ఇంకొకరు తెలుసుకుని, సర్దుబాటు ధోరణిలో ముందుకు సాగుతున్నారు అనేది బహిరంగ రహస్యం. నిజానికి కృష్ణా, గోదావరి నదీజలాల వివాదం కూడా ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమే అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. తాజాగా, టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఎంపిక చేసిన నలుగురు సభ్యులు మైహోం రామేశ్వరరావు, హెటిరో పార్దసారధిరెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వెంకన్న స్వామి భక్తులు అవునో కాదో కానీ తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ భక్తులు, కాదంటే జగన్ రెడ్డి భక్తులు. భక్తి మార్గంతో పాటుగా భుక్తి మార్గం, రాజకీయ, వ్యాపార సోపాన మార్గం బాగా తెలిసిన మంచి మిత్రులు. 

అదలా ఉంటే ఒకే రోజు మంత్రివర్గ సమావేశం జరపడం ఒకెత్తు అయితే, అసెంబ్లీ సమావేశాలు కూడా పార్లర్’గా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ శాసన సభ సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతున్నాయి. గురువారం జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో తేదీలు ఖరారు చేయక పోయినా  ఈ నెల చివరి వారంలో  శాసన సభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల శాసన సభలు ఇంచుమించుగా ఒకరోజు అటూ ఇటుగా ఒకేసారి జరుగుతాయి. అయితే ఇలా ఒకే సారి సమావేశాలు జరగడం ఇదే తొలిసారి కాదు, గతంలోనూ ఉభయ రాష్ట్రాల శాసన సభలు ఒకే సారి జరిగిన సందర్భాలు లేక పోలేదు. అయితే ఇప్పుడు, ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా షాడో ఫైటింగ్ సీన్  క్రియేట్ చేసేందుకు, తద్వారా రియల్ ఇష్యూస్ ను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు మాత్రం వినిపిస్తున్నాయి. అలాగే, హుజూరాబాద్ ఉప ఎన్నిక అవసరార్ధం సెంటిమెంట్స్ రెచ్చగొట్టేందుకు కూడా ఇలా ఒకేసారి సభలు సమావేశం అవుతున్నాయని అనుకున్నా అనుకోవచ్చును.