ఎన్నికల్లో అధికారపార్టీ దౌర్జన్యాలు.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు. అంతకుమించి అరాచకాలు. ఏకగ్రీవాల కోసం వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవు. ప్రతిపక్షాలపై దాడులు, బెదిరింపులు, కేసులతో భయోత్పాతం. ఈ మాట అన్నది ఏ విపక్ష నేతో కాదు. స్వయానా అధికార వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు. 

ప్రతిపక్షంలో ఉన్నవారు విమర్శలు చేయడం కామన్. కానీ, అధికార పార్టీ నేతే.. తమ సొంత పార్టీపైనే ఆరోపణలు చేయడం సంచలనమే. పంచాయతీ ఎన్నికలలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలకు చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింత పెరిగాయని కూడా అన్నారు. పనిలో పనిగా, మంత్రి బాలినేని శ్రీనవాసరెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఒంగోలులో సమస్యల పరిష్కారానికి బాలినేని కృషి చేయలేదని, ఏ ముఖం పెట్టుకొని ఒంగోలు ప్రజలను బాలినేని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

అధికారంలోకి రాకముందు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దళితులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఆ సామాజికవర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వైసీపీ నేతలు దళితులపై అమానవీయంగా ప్రవర్తించడంపై ఇటీవల నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు మిన్నంటాయని ఆందోళలకు కూడా దిగాయి కొన్ని దళిత సంఘాలు. అయితే జగన్‌ పార్టీలో పదవులు ఇవ్వకపోగా చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు.