రామ మందిర నిర్మాణమే ప్రధాన ఎజండా.. వచ్చే ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం

 

దశాబ్దాల వివాదానికి తెరదించింది సుప్రీంకోర్టు. రెండు వర్గాలకు సమన్యాయం జరిగేలా అయోధ్య వివాదం పై చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించింది. అయితే  సుప్రీం ఇచ్చిన తీర్పు పై కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పును వెలువరించిన ఐదుగురు జడ్జిలపై ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశాలు ఉండటంతో జడ్జిలకు కేంద్ర ప్రభుత్వం భారీ భద్రత పెంచింది.అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జిలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్.. జస్టిస్ ఎన్ఎస్ఏ బాబ్డే.. జస్టిస్ డీవై చంద్రచూడ్.. జస్టిస్ అశోక్ భూషణ్.. జస్టిస్ అబ్దుల్ నజీర్ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.వీరి నివాసాలకు వెళ్లే రోడ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. జడ్జిల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనాలను కూడా అధికారులను సమకూర్చారు. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు మెరుపు దళాలను కూడా సిద్ధంగా ఉంచారు.అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో రామమందిర నిర్మాణం పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? నిర్మాణం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? అసలు మందిరం నిర్మాణం ఎలా ఉండబోతోంది ? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. 

అయోధ్యలో నిర్మించబోయే మందిరం ప్రపంచంలోనే అతి సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అతి త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించాలని ఆలోచిస్తోంది. అందుకుగానూ ఇప్పటినుండే కేంద్రం కసరత్తులు మొదలుపెట్టింది.. ట్రస్ట్ ఏర్పాటయ్యాక విశ్వహిందూ పరిషత్ బీహెచ్ పీ సహాయంతో మందిర నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని రామ జన్మభూమి న్యాస్ భావిస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయాన్ని సుందరంగా నిర్మించాలని ఆలోచిస్తోందని బీజేపీ నేతలు తెలిపారు. 2024లోపు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తుంది. 2024-25 లోపు రామమందిరాన్ని పూర్తి చేసి ఎన్నికల బరిలోక దిగాలన్న ఆలోచనతో కేంద్ర ఉన్నట్లు వివిధ వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే రానున్న ఐదేళ్ళల్లో రామమందిర నిర్మాణమే కేంద్రం టార్గెట్ గా పెట్టుకుందని తెలుస్తుంది. పగలు.. రాత్రి.. అనే తేడాలేవి లేకుండా పని చేసి రామమందిర నిర్మాణాన్ని చకచకా పూర్తి చెయ్యాలని ఆలోచనలో ఉంది. నిర్మాణానికి కావలసిన రాతి స్తంభాలు 50 శాతం సిద్ధంగా ఉన్నాయంటూ కొందరు తెలిపారు.మిగతా యాభై శాతం స్తంభాలను కూడా అతి త్వరలోనే పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో.. రామమందిరమే ప్రధాన ఎజండాగా మోడీ ప్రచారంలోకి దిగానున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.