హమ్మయ్య.. హక్కుల కమిషన్‌కు జగనన్న ఓకే!

‘ధిక్కరణ’ వచ్చే వరకూ నిద్రపోతున్న అధికారులు

 

ఏబీ వెంకటేశ్వరరావు కేసులోనూ అదే నిర్లక్ష్యం

 

ఎట్టకేలకూ హెచ్చార్సీకి  నోటిఫికేషన్ జారీ

 

సర్కారుకు తప్పిన కోర్టు ధిక్కారం

 

రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ ఏర్పడని ఏపీ మానవ హక్కుల కమిషన్‌పై, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చివరాఖరకు స్పందించింది. దానితో సర్కారు కోర్టు ధిక్కరణ గండం నుంచి బయటపడినట్టయింది. మానవ హక్కుల కమిషన్‌ను నియమించాలని ఏపీ హైకోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకూ జగన్మోహన్‌రెడ్డి సర్కారు దానిపై దృష్టి సారించలేదు. హక్కుల కమిషన్ విభజన కాకపోవడం, ఏపీ హెచ్చార్సీని ఏర్పాటుచేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు, హెచ్చార్సీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

 

మానవ హక్కుల కమిషన్ అనేది.. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక బలమైన న్యాయసాధనం. అక్కడ సామాన్యుడు తమ కష్టం చెప్పడానికి ఫీజులేమీ చెల్లించనక్కర్లేదు. ఒక్క అర్జీ పెట్టుకుంటే చాలు. హక్కుల కమిషన్ స్పందిస్తుంది. కాకుమాను పెదపేరిరెడ్డి... ఉమ్మడి రాష్ట్ర హక్కుల కమిషన్ యాక్టింగ్ చైర్మన్‌గా ఉన్నప్పుడయితే, పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా సుమోటోగా తీసుకుని అధికారులకు నోటీసులిచ్చి, కమిషన్‌కు పిలిపించిన సందర్భాలున్నాయి.

 

అంత ప్రాముఖ్యం ఉన్న హక్కుల కమిషన్ ఏపీకి ఇప్పటివరకూ నియమించలేదు. దానితో బాధితులు హైదరాబాద్‌లో ఉన్న, ఇంకా విడిపోని హక్కుల కమిషన్ కార్యాలయానికి వస్తున్నారు. ఆ విధంగా గత 9 నెలల నుంచి ..హైదరాబాద్ లోని హక్కుల కమిషన్ కార్యాలయంలో ఏపీకి సంబంధించిన కేసులు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. అటు ఏపీకి చెందిన ఉద్యోగులు కూడా, ఇంకా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్న పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల్లో హక్కుల కమిషన్ నియమిస్తామని, స్వయంగా ఏపీ అడ్వకేట్ జనరల్.. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్న బెంచికి హామీ ఇచ్చి నెలలు దాటిపోయింది. దానితో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు.

 

దీనితో స్పందించిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. హక్కుల కమిషన్ నియామకానికి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.  ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన హెచ్చార్సీలో నియమితులయ్యేందుకు ఆసక్తి ఉన్న వారు.. అక్టోబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ పేరుతో నోటిఫికేషన్ విడుదలయింది. ఇప్పటికయినా హక్కుల కమిషన్‌పై ప్రభుత్వం స్పందించడం సంతోషమే.

 

అయితే తాజా నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే... అధికారులకు, ఎవరైనా  ప్రభుత్వ గొంతుపై కత్తి పెట్టినప్పుడే, లేదా గొంతుమీదకు వచ్చినప్పుడే పాత ఫైళ్లు గుర్తుకొస్తాయన్న విషయం మరోసారి స్పష్టమయింది. నిజానికి హెచ్చార్సీ నియామకంపై, హైకోర్టు ఆదేశాలిచ్చి కొన్ని నెలలు దాటిపోయాయి. అయినా దానిని నియమించకపోవడంతో, కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాల్సి వచ్చింది. దీనితో అప్పటికప్పుడు కదిలిన అధికారులు, వాయువేగంతో హెచ్చార్సీ ఫైలును దుమ్ముదులిపి, నియామకానికి సంబంధించి, నోటిఫికేషన్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

 

సీనియర్ ఐపిఎస్ అధికారి, డీజీ అయిన  ఏబీ వెంకటేశ్వరరావు కేసునే తీసుకుందాం. ఆయన కేసులో కూడా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. ఆయనకు సస్పెన్షన్ కాలంలో రావలసిన జీతం, ఇతర ఆర్థిక ప్రయోజనాలతోపాటు, నిర్ణీత గడువులో వివరణ తీసుకోవాలనే మూడు అంశాలతో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే.. ప్రభుత్వం వాటినేమీ అమలు చేయలేదు. దానిపై ఏబీవీ మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఆ గడువు కూడా ముగిసింది. అప్పటివరకూ ఆయనకు సగం జీతం ఇచ్చిన ప్రభుత్వం, కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన తర్వాత దానిని కూడా నిలిపివేసింది. అంటే ఇది కక్షసాధింపుగానే కోర్టు భావించే అవకాశాలు లేకపోలేదు. ఈ అధికారి విషయంలో కూడా అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో, ప్రభుత్వం మరోసారి ధిక్కరణ కేసు ఎదుర్కోవలసి వచ్చింది. అదే ధిక్కరణ పిటిషన్ వేయకముందే మేల్కొని, కోర్టు ఆదేశాలు అమలుచేసి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు.

 

నిజానికి ఇలాంటి కీలక అంశాలలో.. ప్రభుత్వ పరువు పోకుండా- ఉన్నతాధికారులు కోర్టు మెట్లు ఎక్కకుండా.. అధికారులే పర్యవేక్షించి, సమన్వయం చేస్తుండాలి. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫలితంగా, ప్రభుత్వం అప్రతిష్టపాలు కావలసివస్తోందన్న వ్యాఖ్యలు, అటు న్యాయవాద వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. తాజాగా హెచ్సార్సీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ఏదో.. హైకోర్టు విధించిన గడువులోగా ఇచ్చి ఉంటే, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయ్యేది కాదని, అటు వైసీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.

 

హెచ్చార్సీ-ఏబీ వెంకటేశ్వరరావు వేసిన ధిక్కరణ పిటిషన్లు పరిశీలిస్తే... ఉన్నతాధికారులకు-ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయం లేదా? లేక ప్రభుత్వ న్యాయవాదులు చెప్పే సూచనలను, అధికారులు పాటించడం లేదా? పోనీ .. ముఖ్యమంత్రి దృష్టికి,  కోర్టులకు సంబంధించి కీలకమైన అంశాలను తీసుకువెళ్లడంలో సీఎంఓ విఫలమవుతోందా? అసలు ఇవేమీ కాకుండా.. సీఎం ఆదేశాల ప్రకారమే, ఈ వ్యవహారాలు నడుస్తున్నాయా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజం ‘జగన్నాధుడి’కెరుక?

-మార్తి సుబ్రహ్మణ్యం