జనసంద్రంగా మారిన అమరావతి.. అంతటా పండుగ శోభ
posted on May 2, 2025 3:27PM

రాజధాని అమరావతి జనసంద్రంగా మారిపోయింది. రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. శుక్రవారం (మే2) ఉదయం నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో పాటు, రాష్ట్రం నలుమూలల నుంచీ ప్రజలు పెద్ద సంఖ్యలో జనం అమరావతికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం మధ్యాహ్నానికే నిండిపోయింది.
ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాగునీరు, తాత్కాలిక ఆసుపత్రి, అంబులెన్సులను అందుబాటులో ఉంచింది. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలు సభికులలో ఉత్సాహాన్ని నింపాయి. రాజధానిగా అమరావతి ప్రస్థానాన్ని పునఃప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి పండుగ శోభను సంతరించుకుంది.