అమరావతిపై ఫేక్ పోస్టు.. ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
posted on Sep 24, 2025 9:42AM

ఓ ఫేస్ బుక్ పోస్టు ఆ ప్రభుత్వోద్యోగి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రభుత్వం వేటు వేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి ముంపునకు గురైందంటూ ఫొటోలతో తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
ఆ పోస్టుకు అమరావతి మునిగిపోయిందని క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సుభాష్ పై నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సుభాష్ ను వివరణ కోరింది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ వివరణ ఇచ్చారు. ఆ సమాధానంతో సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేసింది.