ఫేస్‌బుక్ ల‌వ్‌.. మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌.. విజ‌య‌వాడ‌ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

అది ల‌వ్‌స్టోరీనా? క్రైమ్‌స్టోరీనా? లేక‌, క్రైమ్‌-ప్రేమ క‌థా చిత్ర‌మా? ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు ఇప్పుడు అది తేల్చే ప‌నిలో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. రెండు రోజులుగా మూడు పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలోని ఖాకీలు రెస్ట్‌లెస్‌గా ప‌ని చేస్తున్నారు. ఆ ల‌వ్ కమ్‌ మ‌ర్డ‌ర్ అటెంప్ట్ మిస్ట‌రీని  ఛేదించేందుకు పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ఫేస్‌బుక్‌లో పరిచయం ఆ యువకుడి ప్రాణాల మీదకి తెచ్చింది. మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం పోలీసులను ప‌రుగులు పెట్టించింది. బాధిత యువ‌కుడు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. భవానీపురానికి చెందిన యార్లగడ్డ డేవిడ్‌ విజయవాడలో ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో జాబ్‌ చేస్తున్నాడు. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ యువతితో రెండేళ్ల కిందట అతడికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ యువతి సోమవారం సాయంత్రం యువకుడికి ఫోన్‌ చేసి తాను మైలవరం మండలం పుల్లూరులోని తన మామయ్య ఇంటి ద‌గ్గ‌ర‌ ఉన్నానని చెప్పింది. రాత్రికి గుంటూరులో పెళ్లికి వెళ్లాల‌ని.. తనను తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేసింది. ల‌వ‌ర్ కోర‌డంతో ప్రియుడు ఎగేసుకుని వెళ్లాడు. క‌ట్ చేస్తే.. సీన్ సితార్ అయింది.

రాత్రి 9 గంటల టైమ్‌లో కారులో విజయ‌వాడ నుంచి పుల్లూరు చేరుకున్నాడు డేవిడ్‌. ఆమెకు ఫోన్‌ చేసి ఇంటి అడ్ర‌స్ అడ‌గ్గా.. తన బ్ర‌ద‌ర్‌ వచ్చి తీసుకొస్తాడని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఆమె సోదరుడు, ఇంకో వ్య‌క్తితో క‌లిసి వ‌చ్చి కారులో డేవిడ్‌ను జమలాపురం రూట్‌లో తీసుకెళ్లారు. మార్గ మ‌ధ్య‌లో బ్లేడుతో డేవిడ్‌ మెడ, చేతులు కోశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని అదే కారులో జి.కొండూరు మండలం కవులూరు, శాంతినగర్‌ మధ్య బుడమేరు కాలువలో పడేశారు. డేవిడ్‌ ఫోన్‌, ఉంగరాలు లాక్కొని.. కారులో పరారయ్యారు. కారును జి.కొండూరు, చెవుటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారి బైపాస్‌లో వదిలేసి వెళ్లిపోయారు.

ఇక‌, డేవిడ్‌ను కాలువ‌లో ప‌డేయ‌గా ఓ క‌ర్ర‌దుంగ సాయంతో ఒడ్డుకు చేరాడు. అటుగా వెళ్తున్న ఆటోను ఆపి, విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇబ్రహీంపట్నం పోలీసులకు స‌మాచారం అంద‌డంతో అత‌న్ని విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 

ఇంత‌కీ డేవిడ్‌పై ప్రేయ‌సి సోద‌రుడు ఎందుకు దాడి చేశాడు? దాడి వెనుక ఆమె ప్ర‌మేయం ఉందా? డేవిడ్ త‌ప్పేమైనా ఉందా? ఇలా వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాను యువతిని ప్రేమించానని, ఆమె రమ్మంటేనే వచ్చానని డేవిడ్‌ చెబుతున్నాడు. ఆ యువతి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. దాడి జ‌రిగిన‌ట్టు చెబుతున్న ప్రాంతంపైనా క్లారిటీ లేదు. డేవిడ్ చెబుతున్న‌దంతా నిజ‌మేనా? క‌ట్టు క‌థా? అనే కోణం లోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. నిజ‌మే అని తేలితే.. డేవిడ్‌పై ఆ యువ‌తి త‌ర‌ఫు వారు ఎందుకు హ‌త్యాయ‌త్నం చేశార‌నే విష‌యం ఆరా తీయ‌నున్నారు. ప్ర‌స్తుతానికైతా ఆ క్రైమ్ ప్రేమ క‌థ చిత్ర‌మ్‌.. మిస్ట‌రీగా మారింది.