బాబు, లోకేష్ ల ఫొటోలతో మాజీ మంత్రి మనవడి ఘరానా మోసం !

 

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లతో దిగిన ఫోటోలను చూపిస్తూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేశాడు ఒక టీడీపీ నేత. ఆయనేదో గల్లీ లీడర్ అనుకునేరు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా చేసిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు. ఆయన పేరు రెడ్డి గౌతమ్, ఆయన మాజీ మంత్రి మనవడు అని తెలియడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయ్యింది. 

ఎక్కడో తీగ లాగితే డొంకంతా కదిలి ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి నంద్యాలకు చెందిన నరాల శివనాగార్జునరెడ్డి కర్నూలు జిల్లా శిరువెళ్ల మండలానికి చెందిన చాకలి మనోహర్‌ కి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.80 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీస్‌ సబార్డినేట్‌గా నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను సృష్టించి  రూ.30 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. అయితే ఈ లెటర్‌పై అనుమానం రావడంతో మనోహర్‌ ఈ నెల 16న విషయాన్ని సచివాలయ అధికారుల దృష్టికి తేసుకెళ్లాడు. 

వారు దాన్ని నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌గా ధృవీకరించడంతో మోసపోయానని గ్రహించి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకి ఈ ముఠా అంతా బయటకు వచ్చింది. మాజీ మంత్రి మనవడు గౌతమ్ తో పాటు, నంద్యాల ప్రాంతానికి చెందిన శివనాగార్జునరెడ్డి, సతీష్, మిథున్‌ చక్రవర్తి ఓ టీమ్ గా ఏర్పడ్డారు. వీరంతా నిరుద్యోగులకు ఎరవేసి, వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఇలా ఏడుగురి నుంచి రూ. 14 లక్షల దాకా వసూలు చేశారు. నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లను సృష్టించి బాధితులకు ఇచ్చేవారు. డబ్బు పోగొట్టుకున్న వారు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వీరి వ్యవహారం బయటకి రాలేదు.