సారీ! కమ్యూనికేషన్ గ్యాప్! లక్ష కాదు ఆరు లక్షలు...

 

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా నిలబడిన జగ్గారెడ్డికి తెలంగాణా తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పూర్తి సహకారం అందిస్తూ ఆయన తరపున చాలా చురుకుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ, ఆయనపై తెరాస వేసిన సమైక్యవాది ముద్రను మాత్రం ఎంత ప్రయత్నించినా వదిలించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఒక దశలో సహనం కోల్పోయి జగ్గారెడ్డిని సమైక్యవాది అన్నవారిని చెప్పుతో కొడతానని హెచ్చరించారంటే, దాని గురించి వారు ఎంతగా మదనపడుతున్నారో అర్ధమవుతుంది. జగ్గారెడ్డికి వ్యతిరేఖంగా తెరాస చేస్తున్న ఈ సమైక్య ప్రచారం ప్రజలపై చాలా ప్రభావం చూపించవచ్చు గనుక అది తమ అభ్యర్ధి విజయావకాశాలను దెబ్బ తీయవచ్చని తెదేపా, బీజేపీ నేతలు చాలా ఆందోళన చెందుతున్నారు.

 

తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్నకె. ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేస్తున్న మంత్రి కే. హరీష్ రావు ఇప్పుడు ఆయన విజయంపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఒట్టి విజయమే కాదు కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని డంకా భజాయించి మరీ చెపుతున్నారు. ఇదే అదునుగా తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హరీష్ రావును ఇరుకున పెట్టేందుకు “మీ అభ్యర్ది కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలవకపోతే మీరు రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా?” అని ఒక సవాలు విసిరారు. దానిని తను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించడమే కాక, “ఒకవేళ తమ అభ్యర్ధి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచినట్లయితే మీరు రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా?” అని ఎదురు సవాలు కూడా విసిరేసరికి, ఎర్రబెల్లి కంగు తిన్నారు.

 

హరీష్ రావు అంత నమ్మకంగా తమ అభ్యర్ధి లక్ష ఓట్లతో గెలుస్తారని చెపుతున్నప్పుడు, తెగించి ఆయన సవాలును స్వీకరిస్తే, బీజేపీ అభ్యర్ధి సంగతలా ఉంచి ముందు తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందని గ్రహించిన ఎర్రబెల్లి తన సవాలుకు మరికొంచెం సవరణ చేసి, “నేను చెప్పింది హరీష్ రావు సరిగ్గా వినట్లు లేదు. నేను ఆరు లక్షల మెజార్టీతో గెలవాలని సవాలు విసిరితే ఆయన కేవలం లక్ష ఓట్లు మెజార్టీకి సిద్దమంటున్నారు. ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్ధి జగ్గారెడ్డి చేతిలో ఘోరపరాజయం పొందుతారనే భయంతోనే బహుశః ఆయన ఆవిధంగా వెనక్కి తగ్గి ఉండవచ్చును. నేను మాత్రం నేటికీ నా మాట మీదనే నిలబడి ఉన్నాను. ఆయన కూడా అందుకు సిద్దమయితే అందుకు నేను సిద్దమే,” అని సవరణ ప్రకటన చేసారు.

 

అయితే తెరాస నేత హరీష్ రావు తమ అభ్యర్ధి కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని నమ్మకంగా చెపుతుంటే, ఎర్రబెల్లి అతనిని తాము ఏవిధంగా ఓడిస్తామో మాట్లాడకుండా, అతని మెజార్టీ గురించి ఈవిధంగా పందేలు కాయడం గమనిస్తే, తెరాస అభ్యర్ధి గెలుపుపై తెరాస నేతల కంటే తెదేపా, బీజేపీ నేతలకే ఎక్కువ నమ్మకంగా ఉన్నట్లుంది. ఏమయినప్పటికీ వారిరువురి వాదోపవాదాలు చూస్తుంటే పోటీ ప్రధానంగా ఆ రెండు పార్టీల మధ్యే సాగేలా కనబడుతోంది.