మెదక్ లోక్ సభ ఉప-ఎన్నికలలో చతికిలబడిన కాంగ్రెస్

 

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకొంటున్నాయి. కాంగ్రెస్ తరపున సునీత లక్ష్మా రెడ్డి, తెరాస తరపున కే.ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా జగ్గారెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి ముగ్గురిలోకి కాంగ్రెస్ అభ్యర్ధి సునీత లక్ష్మా రెడ్డి ఇంతకాలం అవిబాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినందున ఆమెకే రాజకీయ అనుభవంతో తోడు పరిపాలనా అనుభవం కూడా ఉన్నందున సహజంగానే మిగిలిన అభ్యర్ధులపై ఆమెదే పైచేయిగా ఉండాలి. కానీ అధికార తెరాస ప్రచారం, దాని ప్రభావం ముందు కాంగ్రెస్ నేతల ప్రచారం వెలవెలబోతోంది. కారణం నేటికీ వారు ‘తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది మేమే’ వంటి అసంబద్దమయిన ప్రచారానికే పరిమితమవుతున్నారు తప్ప, అధికార తెరాస పార్టీ వైఫల్యాలను సమర్ధంగా ఎత్తి చూపలేకపోతున్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ఈమూడు నెలలలో తమ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాల గురించి చాలా బాగా ప్రచారం చేసుకొంటూనే, ఇంత కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు ఏమి ఒరగబెట్టిందని ఎదురు ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీని చాలా సమర్ధంగా నిలువరించగలుగుతున్నారు.

 

“ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ, దాని తెలంగాణా నేతలు కూడా తెలంగాణాకు అన్యాయం చేశారు గనుకనే తెరాస పోరాడి తెలంగాణా సాధించుకోవలసి వచ్చింది కదా? అందుకే టీ-కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడవలసి వచ్చింది కదా? అటువంటప్పుడు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ తెలంగాణాకు ఏదో మేలు చేసిందని ఏవిధంగా చెప్పుకొంటున్నారు?” అని తెరాస నేతల వాదన. వారి ఈ వాదనకు, ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల వద్ద సరయిన జవాబు లేదు. కనీసం తెలంగాణా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ప్రజలముందు నిలదీయలేక చతికిలపడుతుండటంతో కాంగ్రెస్ నేతలు ‘తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది మేమే’ అనే ప్రచారానికే పరిమితం కావలసివస్తోంది. ఏమయినప్పటికీ అధికారంలో ఉంటే ఆ ఆత్మవిశ్వాసమే వేరు.