ఆరోగ్యాన్నీ, వ్యాపారాన్నీ దూరం చేసే పరిమళాలు

 

ఏదన్నా కార్యాలయంలోకి అడుగుపెట్టండి- వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు వారు విచ్చలవిడిగా వెదజల్లిన పరిమళాలు మీ ముక్కుపుటాలను అదరగొట్టేస్తాయి. ఏదన్నా శుభకార్యంలోకి ప్రవేశించండి- తోటివారి మధ్య గుప్పుమనేందుకు జనాలు చల్లుకునే అత్తరులు మీ మతిని పోగొట్టేస్తాయి. అక్కడా ఇక్కడా ఎందుకు? మన ఇంట్లోనే బాత్రూం దగ్గర్నుంచీ డ్రెస్సింగ్ టేబుల్‌ వరకూ నానారకాల పరిమళాల వరకూ వాడేస్తుంటాము. కానీ వీటి గురించి ఇప్పుడు వచ్చిన ఓ పరిశోధన కళ్లని తెరిపిస్తోంది.

 

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘అనే స్టెనమెన్‌’ అనే పరిశోధకురాలు అమెరికా, ఆస్ట్రేలియాల్లోని వేయికి పైగా వ్యక్తులని గమనించారు. వారంలో ఒక్కసారైనా పరిమళాల మధ్య ఉన్నవారు రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. తమ ఇంట్లో వాడే పరిమళమా, బయట ఎక్కడన్నా ఆఘ్రాణించినదా అన్న తేడా లేకుండా 34.7 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యకు లోనయ్యారట.

 

 

ఎయిల్‌ ఫ్రెషనర్లు, డియోడరెంట్లు, షాంపూలు, సబ్బులు, లోషన్లు... ఇలా ఒక్కటేంటి, పరిమళాలకి సంబంధించి ఎలాంటి రసాయనాలని పీల్చినా కూడా అనారోగ్యం తథ్యం అంటున్నారు ఈ పరిశోధకురాలు. తలనొప్పి, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఆస్తమా, చర్మవ్యాధుల వంటి రకరకాల సమస్యలు వీటితో తలెత్తుతున్నట్లు గమనించారు. డియోడరెంట్లు, ఎయిర్‌ ఫ్రెషనర్ల వల్లే అధికశాతం సమస్యలు వస్తున్నట్లు తేలింది.

 

పరిమళాలకీ, వ్యాపారానికీ పొసగకపోవడం ఈ పరిశోధనలో తేలిన ఓ చిత్రమైన విషయం. ఎందుకంటే ఒక 20 శాతం మంది జనం, తాము ఏదన్నా వ్యాపారసంస్థలోకి అడుగుపెట్టగానే అక్కడి గాఢమైన పరిమళాన్ని పీల్చగానే ఇబ్బండి పడ్డామని చెప్పుకొచ్చారు. వీలైనంత వెంటనే ఆ ప్రదేశం నుంచి తప్పుకోవాలని వారికి తోచిందట.

 

 

 

పరిశోధనలో తేలిన మరో ముఖ్య విషయం... వినియోగదారుల అమాయకత్వం! పరిమళాలను వాడేవారికి అవి ఎలా రూపొందుతాయో, వాటిలో ఎలాంటి హానికారక పదార్థాలు ఉంటాయో అన్న విషయాల మీద ఏమాత్రం అవగాహన కనిపించలేదు. పెట్రోలియం ఉత్పత్తులతో కూడా సహజమైన పరిమళాన్ని తలపించే సువాసనలను సృష్టించవచ్చనీ, వీటిలో వాడే కొన్ని రసాయనాలతో వాయుకాలుష్యం ఏర్పడుతుందనీ, మరికొన్ని రసాయనాలతో క్యాన్సర్‌ సైతం సంభవిస్తుందనీ చాలామందికి తెలియదు. దురదృష్టవశాత్తూ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని, కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో ఉన్న రసాయనాలన్నింటనీ లేబుల్ మీద ముద్రించకుండా తప్పించుకుంటున్నాయి.

 

‘పరిమళాల వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా! మరి వీటి నుంచి దూరంగా ఉందాము’ అని ప్రయత్నించడం కూడా అసాధ్యమే! ఎందుకంటే దాదాపు 99.1 శాతం మంది వారంలో ఒక్కసారైనా ఏదో ఒక పరిమళం బారిన పడినట్లు తేలింది. కాకపోతే వ్యక్తిగతంగా వీటి వాడకానికి వీలైనంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే కృత్రిమమైన పరిమళాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండనే ఉండదంటున్నారు. ఇక మరీ అవసరమైన సందర్భాలలో కాస్త ఖరీదైనా కూడా పూలు, నిమ్మపండ్లు వంటి సహజసిద్ధమైన పదార్థాలతో రూపొందించిన పరిమళాలనే వాడమని సూచిస్తున్నారు.                  

 

 - నిర్జర.