భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే.. ఇవి పాటించాలి..!


పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిచయం లేకుండా పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరూ ఒకటై జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. ఈ బంధాన్ని బలంగా, ఆనందంగా నిలుపుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించడం చాలా అవసరం. నేటి కాలంలో వివాహాలు జరిగిన తరువాత చాలా తొందరగా వివాహ బంధాలు విచ్చిన్నం అవుతున్న నేపథ్యంలో వివాహ బంధాలు బలంగా నిలబడటానికి రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన కొన్ని చిట్కాలు ఇవే..

సమయం..

రోజువారీ బిజీ జీవితంలోనూ కనీసం కొంత సమయాన్ని ఒకరికి ఒకరు కేటాయించాలి. కలసి భోజనం చేయడం, ప్రాముఖ్యత ఉన్న విషయాల్లో కలిసి మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరూ కలసి చేయగలిగిన పనులను పరస్పరం స్నేహభావంతో చేసుకోవాలి. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది.

పరస్పర గౌరవం..

ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతూ ఉంటే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు.  ఈ కాలంలో అమ్మాయిలు  తమకంటూ ప్రాధాన్యత ఉండాలని, తమకు గౌరవం ఉండాలని అనుకుంటారు. కాబట్టి భర్తలు భార్యలను  అపహాస్యం చేయడం, గౌరవం లేకుండా మాట్లాడటం,  భార్యలు అంటే పని మనుషులు, బానిసలు అన్నట్టు ట్రీట్ చేయడం మానుకోవాలి.    ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని ఇరువురూ గౌరవించాలి .  విషయం పెద్దదైనా, చిన్నదైనా ఇరువురూ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, గౌరవించుకోవాలి. .

నమ్మకం..

అబద్ధాలు, దాచిపెట్టిన విషయాలు బంధాన్ని దెబ్బతీస్తాయి.  ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండాలి.   తప్పు చేసినా సరే.. నిజాయితీగా ఒప్పుకుని సరిదిద్దుకునే అవకాశం అడగాలి. నిజాయితీగా ఉండటం వల్ల విశ్వాసం పెరుగుతుంది.

సహనంగా ఉండాలి..

ప్రతి చిన్న విషయం మీద గొడవపడకూడదు.  రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎప్పుడూ వేర్వేరు అలోచనలతో, వేర్వేరు ప్రవర్తనలతో ఉంటారు.  ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలన్నా,  ఏవైనా తప్పులు జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవాలన్నా  సహనం ఉండాలి.  ఏదైనా గొడవ లేదా తప్పిదం జరిగినప్పుడు వెంటనే మాట అనడం లేదా నిందించడం చేయకూడదు. ఇది బంధాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలను  మౌనంగా వదిలేయడమూ ఒక తెలివైన పరిష్కారం.

మెచ్చుకోవడం..

ఒకరి ప్రయత్నాలను,   ఒకరి గెలుపును, ఒకరి సృజనాత్మకతను మెచ్చుకోవడం చాలా ముఖ్యం.

భార్యాభర్తలలో ఎవరైనా సరే ఒక విజయం సాధించారు అంటే భాగస్వామి తోడ్పాటు ఎంతో కొంత ఉంటుంది.  అందుకే విజయాలు సాధించినప్పుడు థాంక్స్ చెప్పడం, నీ వల్లే ఈ పని ఫర్పెక్ట్ గా చేయగలిగాను లాంటి మాటలు సంబంధాన్ని సానుకూలంగా ఉంచుతాయి.

నిర్ణయాలు..

ముఖ్యమైన విషయాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఒకరిపై ఆధిపత్యం చూపడం వలన విభేదాలు వస్తాయి. భార్యాభర్తలలో ఇద్దరిలో ఒకరికి విషయం మీద అవగాహన లేకపోయినా సరే.. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే అవగాహన పెరుగుతుంది. కలిసి నిర్ణయం తీసుకున్నాం అనే ధైర్యం కారణంగా పనులలో వైఫల్యాలు ఎదురైనా తప్పిదం ఒకరిమీదే ఉండదు.

రొమాంటిక్ మూడ్..

చిన్న చిన్న సర్ప్రైజులు, ప్రేమపూరిత సందేశాలు, ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపడం బంధాన్ని చాలా సన్నిహితం చేస్తాయి.  రెండు వేర్వేరు జెండర్ ల మధ్య బంధం కాబట్టి శారీరక బంధం బలంగా ఉంటే అది ఇద్దరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతుంది.

నిందలొద్దు..

ఎవరి తప్పైనా, ఆరోపణలకన్నా పరిష్కార దిశగా ఆలోచించడం మంచిది.  "నువ్వే తప్పు చేశావు" అనే ఆలోచనను మార్చుకోవాలి.

ఆర్థిక విషయాలు..

ఖర్చుల విషయంలో ఓపికగా, పరస్పర అవగాహనతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో దాపరికాలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడానికి డబ్బుకు అవకాశం ఇవ్వకూడదు.

స్నేహం..

జీవిత భాగస్వామిగా కాక, స్నేహితుల్లా ఉండాలి. ఇలా ఉంటే ఏ విషయాలు అయినా ఒకరితో ఒకరు నిస్సంకోచంగా షేర్ చేసుకోగలుగుతారు.  ఇది ఒకరి మీద మరొకరికి నమ్మకాన్ని పెంచుతుంది.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News