సారా వ్యతిరేక ఉద్యమకారిణి రోశమ్మ మృతి
posted on Aug 7, 2016 12:22PM

సారా మహమ్మారిపై అలుపులేని పోరాటం చేసిన దూబగుంట రోశమ్మ ఇకలేరు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని తూర్పు దూబగుంట గ్రామానికి చెందిన వర్థినేని రోశమ్మ భర్త తాగుడుకు బలై మరణించడంతో కొడుకులను పెంచడానికి ఆవిడ చాలా కష్టాలు పడ్డారు. తనలాంటి పరిస్థితి ఇంకేవరికి పట్టకూడదని తూర్పు దూబగుంట గ్రామం నుంచే మద్యపాన నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. అది క్రమంగా జిల్లా అంతటా వ్యాపించి..రాష్ట్రం మొత్తానికి పాకింది.
అప్పటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ ఆ ఉద్యమానికి ప్రభావితమై, టీడీపీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఇచ్చిన హామీని అమలు చేశారు. అయితే వయసు మీదపడటంతో అవిడ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీలు పాడైపోయిన దశలో డయాలసిస్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో వైద్యానికి దూరమయ్యారు. ఈ క్రమంలో నిన్న ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.