ఏపీలో ఏమి జరుగుతోంది? అరాచకం రాజ్యమేలుతోంది..!

సహజంగా ఎక్కడైనా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తాయి, అలజడులు సృష్టిస్తాయి. కానీ,ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం బండి రివర్స్’లో నడుస్తోంది. అనుభవ రాహిత్యమో, అజ్ఞానమో లేక ఆ రెండూ కలగలిసిన దురహంకారమో కానీ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, తెలుగు దేశం పార్టీ టికెట్’పై గెలిచి, అధికారికంగా వైసీపీలో చేరకుండానే, చేరినట్లుగా వ్యవహరిస్తున్న,గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరకు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి వంకర చూపులు చూస్తున్నారు. వక్ర బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెయ్యి అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక తప్పునుంచి తప్పించుకునేందుకు, వంద తప్పులు చేస్తూ పోతోంది. అందుకే ప్రజల ముందు, న్యాయస్థానాల ఎదుట  అభాసు పాలవుతోంది.  అందుకే, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? అని రాష్ట్ర హై కోర్టు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టే, రాష్ట్రం ఎటు పోతోందో, ఎంతలా దిగజారి పోతిందో  వేరే చెప్పవలసిన అవసరం లేకుండా అర్ధమవుతోంది. 

రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన సాగడం లేదు, అన్నదే హై కోర్టు  రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేసిన తాజా అక్షింతల సారాంశం.హైకోర్టు అక్షింతలు వేసిది పోలీసల నెత్తినే కావచ్చును కానీ,అధికారంలో ఉన్నవారిలో, ప్రభుత్వ సలహాదారు సజ్జల వారితో సహా ఏ ఒక్కరికైనా ఒకింత  విజ్ఞత, వివేచనా ఉన్నా న్యాయస్థానం ఎవరిని ఉద్దేశించి, అంత తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిందో అర్థమవుతుంది. అంతటి విజ్ఞత, వివేచనా ప్రభుత్వానికి లేదనే కావచ్చును, న్యాయస్థానం సర్కార్ తప్పును వివరంగా, విశదపరించింది.  “రాష్ట్రంలో పోలీసులకు చట్టబద్ద పాలన అంటే గౌరవం లేదు. హై కోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ద పదవులలో ఉన్న వారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉత్సాహం చూపించని పోలీసులు, ముఖ్యమంత్రిని దూషించారనే కారణంతో  తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి విషయంలో అంత ఉత్సాహం చూపవలసిన అవసరం ఏముంది? గౌరవం, వ్యక్తిగత ప్రతిష్ట ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడవలసిన బాద్యత పోలీసుల పై  ఉంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు, ముఖ్యమంత్రి  అయినా సరే, పోలీసుల వ్యవహార శైలి పై అభ్యంతరాలతో కోర్టు ముందుకు ప్రతి రోజు పలు వ్యాజ్యాలు వస్తున్నాయి . పట్టాభి అరెస్ట్’ విషయంలో పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు” అంటూ న్యాయస్థానం పోలీసుల వ్యవహారశైలి పైనే కాదు, ప్రభుత్వం దుర్నీతి, దుర్మార్గ వ్యవహార శైలి పైనా అక్షింతలు వేసింది. ఒక రకంగా చూస్తే, రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వాన్ని పరోక్షంగానే అయినా అభిశంసించిందని కూడా  అనవచ్చునేమో. అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. 

అయితే అదేమీ విచిత్రమో కానీ, బుగ్గకార్లలో తిరుగుతున్న, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్’లు, వందమందో ఆపైనో ఉన్న సలహాదారులకు ఈ విషయం ఎందుకో  తలకెక్కడం లేదు. ఈ ప్రభుత్వ వైఖరి సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇలా మంత్రులు, అధికారులు, సలహాదారులు ఎవరికి వారు మనకెందుకులే అని కొందరు, భయంతో ఇంకొందరు  మౌనంగా ఉన్నా,లేక ముఖ్యమంత్రి తానా అంటే, తాము తందానా అన్నా, పరిస్థితి విషమించి చేజారి పోయేందుకు అట్టే కాలం పట్టదు. ఇప్పుడు ఏపీలో జరిగింది, జరుగుతోంది కూడా అదే, ముఖ్యమంత్రి ఏది చెబితే అదే పవిత్ర బైబిల్ సూక్తి అనంట్లుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఇలా అధికార యంత్రాగంలో జీ హుజూర్ మనస్తత్వం బలిసి పోవడం వలన  ఇలంటి జరగరాని అనర్ధాలు అన్నీ జరిగి పోతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అధికారులు కూడా, కోర్టు బోనులో నిలబడి సంజాయిషీ ఇచ్చుకోవలి వస్తోంది. అయినా, అందరూ కాకపోవచ్చును కానీ, కొందరు  అధికారులు అదే పంధాలో పోతున్నారు.  

ఇక ప్రస్తుత బూతుల భాగోతం విషయానికే వస్తే, ఈ చండాలం అంతటికీ మూలం, రాష్ట్రం డ్రగ్స్, గంజాయి అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందనే ఆరోపణ,ఆ ఆరోపణ చుట్టూ అల్లుకున్న వివాదం. నిజానికి,ఇది కేవలం ఆరోపణ మాత్రామేకాదు,నిజం. అలాగే, డ్రగ్స్, గంజాయి అక్రమ దందా, ఇప్పుడే మొదలైందా అంటే కాదు. అధికార పార్టీ నాయకులు, చివరకు సంబంధిత  ప్రభుత్వ అధికారులు కూడ తమను తాము డిఫెండ్ చేసుకునేందుకు చెపుతున్న గతాన్ని కొట్టివేయడం కుదరదు. అయితే, గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడూ ‘జరగవచ్చును’ అనేది మాత్రం  తప్పు. ఆ మొదటి తప్పును అసలు సమస్యను కప్పి పుచ్చుకునేందుకు, పట్టాభి తిట్టును అడ్డుపెట్టుకుని, దానికి విరీత అర్థాలు జోడించి, తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపి వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం రెండవ తప్పు. ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి పట్టాభి తిట్టుకు ఉన్న నానార్ధలలో తమకు అనుకూలమానుకున్న, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్నే ... అంత మాటన్నారని, అమ్మను అవమానించే ఆ మాటను తననోటితోనే బహిరంగ వేదిక నుంచి రాష్ట్ర మంతా వినిపించడం, అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు  అందరూ బీపీ రోగులని నిర్ధారించడం, బీపీలు పెరిగే దాడులు చేశారని ముఖ్యమంత్రి బహిరంగాంగా సమర్ధించడం అన్నిటినీ మించిన అతి పెద్ద తప్పు. నిజానికి ఆది తప్పు మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని ఉల్లంగించడం కూడా ఆవుతుంది. 

అందుకే వైసీపీ బీపీ బ్యాచ్, బీపీ ఇంకా పెరిగి మర్దల్లో, మాన భంగాలో చేసినా ముఖ్యమత్రి వాటినీ సమర్దిస్తారా అని అడుగుతున్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేసే వారు, రథాలను దగ్ధంచేసే వారు  మతి స్థిమితం లేని పిచ్చోళ్ళు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయలపై దాడులు చేసే వారేమో .. బీపీ రోగులు. బాగుంది, ఇక మర్డర్లు ఇతర నేరాలు చేసే వారికి కూడా ముఖ్యమంత్రి ఏదో ఒక రోగాన్ని అతికిస్తే,, సరిపోతుందని, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం చేయవలసింది బూతుల విచారణ కాదు, ఈ మొత్తం  రచ్చకు మూలమైన డ్రగ్ మాఫియా, గంజాయి దందా మీద దృష్టి పెట్టాలని మాజీ  ఐఏఎస్, ఐపీఎస్ సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.