ఢిల్లీలో చంద్రబాబు ఏం చేస్తారో.. వైసీపీలో కలవరం..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రం పెద్దలను కలవబోతోంది. సోమవారం మధ్యాహ్నం టీడీపీ బృందానికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది.

సోమవారం  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారైన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేతలు  ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఆదివారం  సాయంత్రం  అచ్చెం నాయుడు, కేశినేని నాని ఇతర నేతలు ఢిల్లీకి వెళుతున్నారు. సోమవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంత మంది నేతలు ఢిల్లీకి పయనం కానున్నారు.  సోమవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భారత రాష్ట్రపతితో టీడీపీ నేతలు భేటీ అవనున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నారు. 

రెండున్నర సంవత్సరాల తరువాత చంద్రబాబు హస్తినకు వెళుతున్నారు. హోంమంత్రితో పాటు మరికొందరిని కూడా కలిసే అవకాశం ఉంది. ఏపీలో మాదకద్రవ్యాలు , వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. రెండు రోజులపాటు  చంద్రబాబు బృందం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసంపై ఢిల్లీలో నేతలకు బృందం సభ్యులు వివరించనున్నారు. టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసం, అక్రమ కేసులు వంటి అంశాలను  టీడీపీ బృందం కేంద్ర పెద్ద దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.