ఆంధ్రప్రదేశ్ లో కుక్కకు ఓటు హక్కు... అధికారులకు జనం నీరాజనం...
posted on Feb 10, 2020 8:40AM
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయబోతోంది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తనకూ ఓటు హక్కు ఉందని ఓటర్ లిస్ట్‌లో తన ఫొటో చూపించి మరీ ఓటు హక్కును వినియోగించుకోబోంది. అదేంలటీ... కుక్కకు ఓటా... అని నోరెళ్ల బెడుతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఇప్పటివరకు హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలకు మాత్రమే పలు గ్రామాల్లో ఓటు హక్కు కల్పించిన అధికారులు... ఈసారి గ్రామ సింహం కుక్క గారికే ఏకంగా ఓటు హక్కు కల్పించేశారు. ఇంతకీ, కుక్కకు ఓటు హక్కు కల్పించిన ఆ ప్రబుద్దులు ఎవరనే కదా మీ సందేహం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ అధికారులు చేసిన నిర్వాకం ఇదీ.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోన్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టారు. అయితే, ఫైనల్ ఓటరు లిస్టును విడుదల చేసిన ఏలూరు కార్పొరేషన్ అధికారులు... ఓటరు జాబితాలో కుక్క ఫొటో ఓటు హక్కు కల్పించారు. ఏలూరు 12వ డివిజన్ లో బన్నీ గార పేరుతో 5928 సీరియల్ నెంబర్ తో పోలింగ్ స్టేషన్ నెంబర్ 194లో కుక్కకు ఓటు ఉన్నట్లు చూపించారు. అయితే, అధికారులు పంపిన ఓటరు జాబితాలో కుక్క బొమ్మతో ఓటు హక్కు కల్పించినట్లు ఉండటంతో లీడర్లు నోరెళ్లబెడుతున్నారు. ఆహా మన అధికారులు ఎంత గొప్పోళ్లో... కుక్కకు కూడా ఓటు హక్కు కల్పించారంటూ నోరెళ్ల బెడుతున్నారు.
కుక్కకు ఓటు హక్కే కాదు... ఏలూరు కార్పొరేషన్ లో పలుచోట్ల వేర్వేరు సీరియల్ నెంబర్లు, పోలింగ్ బూతుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు కల్పించారు. కొందరికైతే, ఏకంగా ఏడేసి ఓట్లు ఉండటాన్ని చూసి పొలిటికల్ లీడర్స్ తోపాటు జనం అవాక్కవుతున్నారు. అధికారుల పనితీరు గొప్పగా ఉందంటూ నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా కుక్కకు ఓటు హక్కు కల్పించడాన్ని చూసి ఇదేం విడ్డూరమంటూ నవ్వుకుంటున్నారు. మన అధికారుల పనితీరు భలేగుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా, కుక్కకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఏలూరు అధికారులకు దక్కిందంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.