మోడీని పట్టించుకోని ఢిల్లీ ప్రజలు... కమలాన్ని ఊడ్చిపారేసిన చీపురు...
posted on Feb 9, 2020 11:17AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మహా యుద్ధాన్ని తలపించాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ సైన్యాన్ని మోహరించింది కమలదళం. 56 మంది కేంద్రమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపీలను యుద్ధక్షేత్రంలో నిలిపింది. దీనికితోడు ఆరెస్సెస్, వీహెచ్‌పీ కరసేవకులు. ఇంకోవైపు ఏకంగా నరేంద్ర మోడీ ప్రచారాన్ని హోరెత్తించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమర వ్యూహాన్ని రచించారు. అటు కేజ్రీవాల్ మాత్రం తనే ఒక సైన్యంగా కదిలారు. ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ స్థాయిలో మోడీ వర్సెస్ కేజ్రీవాల్‌గా సాగాయి.
అయితే, ఢిల్లీ అసెంబ్లీ సమరంలో చీపురు మరోసారి శివాలెత్తబోతోందని ఎగ్జిట్‌పోల్స్... సింగిల్ వాయిస్‌తో హోరెత్తించాయి. ఆమ్ ఆద్మీకి....బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిందని చాటిచెప్పాయి. సీఏఏ సహా హిందూత్వ అస్త్రాలు ఎన్ని సంధించినా, జనం మాత్రం మోడీని పట్టించుకోలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ చీపురు పార్టీకి మళ్లీ పట్టాభిషేకం చేయడాన్ని చూస్తుంటే... బీజేపీ ఎత్తులు పని చేయలేదని అర్థమవుతోంది. ఇక, ఎలాగూ ఆప్-బీజేపీ మధ్యే పోటీ అని గ్రహించిన కాంగ్రెస్..., కమలం ఓడితే చాలని, లోపాయికారీగా కేజ్రీవాల్‌కు సపోర్ట్ ఇచ్చిందంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమైతే, చీపురు పార్టీ ...దేశానికి కొత్త నిర్దేశం ఇచ్చిందనుకోవాలి. సకల భారత సమాహారమని చెప్పుకునే హస్తినలో, మోడీ ప్రభావం కనిపించకపోతే కమలానికి చిక్కులు మొదలైనట్లే. ఎందుకంటే, దేశవ్యాప్తంగా గాలి మారుతోందని, మోడీ హవా తగ్గుతోందన్న విమర్శలు పెరుగుతాయి. ఢిల్లీ ఫలితాలతో విపక్షాలకు కేజ్రీవాల్ కొత్త దారి చూపొచ్చని...అలాగే, మోడీని ఢీకొట్టగల నాయకుడిగా, అరవింద్ కేజ్రీవాల్ అవతరించవచ్చంటున్నారు విశ్లేషకులు.