ఏపీలో ఏబీవీ కలకలం... జగన్ దుస్సాహసం..!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పని చేశారని... దేశ రక్షణ వ్యవస్థను దెబ్బతీశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.... ఉద్యోగులను వేధిస్తోందని చంద్రబాబు అంటున్నారు. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావుపై ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు వైసీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏబీ వెంకటేశ్వరరావు కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని ఆరోపించారు. వైసీపీని దెబ్బతీయడానికే నిఘా వ్యవస్థను ఉపయోగించారని సజ్జల విమర్శించారు. అయితే, పోస్టింగులు ఇవ్వకుండా ఉద్యోగులను, పోలీసు అధికారులను ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ట్విట్టర్‌లో ఫైరయ్యారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్ప కూడా జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వర్రావును ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు.... ముఖ్యమంత్రి, అలాగే, ఇతర ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండటం సాధారణమేనని అన్నారు. అంతమాత్రాన తర్వాత వచ్చిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. ఒక ప్రభుత్వంలో పని చేశారని... మరో ప్రభుత్వంలో కక్ష సాధించడం గర్హనీమయమన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. కులం పేరుతో, పార్టీ పేరుతో ఉద్యోగులను బలిపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఏబీ వెంకటేశ్వర్రావు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. అక్రమాల కారణంగా తనపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్టపరంగా ముందుకు వెళ్తానన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు. అయితే, ఏబీ వెంకటేశ్వరరావుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయంటోంది ప్రభుత్వం. మొత్తానికి, ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో ముదురుతోంది. ఏబీపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరుపాలన్న ఆలోచనలో సర్కార్‌ కనిపిస్తోంది. మరి, ఏబీ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.