కేటీఆర్ మెడలో పసుపు కండువా! ఎందుకో తెలుసా...
posted on Oct 13, 2021 4:21PM
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మిసిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు మెడలో పసుపు కండువా వేసుకున్నారు. తెలుగు దేశం పార్టీ జెండా అయిన పసుపు కండువాను మంత్రి కేటీఆర్ ఎందుకు వేసుకున్నారని షాకవుతున్నారా.. అయితే దానికో కారణం ఉంది. తమిళనాడు ఎంపీలు ఆయనకు పసుపు కండువా వేశారు.
వివరాల్లోకి వెళితే తమిళనాడులో అధికార పక్షంగా ఉన్న డీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ రద్దు కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రాసిన లేఖతో డీఎంకే ఎంపీలు వీరస్వామి, ఎల్ఎం గోవింద్ తెలంగాణ భవన్ కు విచ్చేశారు. అక్కడున్న మంత్రి కేటీఆర్ ను కలిసి లేఖ అందజేశారు. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీలు కేటీఆర్ మెడలో పసుపు కండువా వేశారు.
డీఎంకే పార్టీ ఎంపీలు పసుపు కండువా వేయడానికి కూడా కారణం ఉంది. వాళ్ల పార్టీ కలర్ కూడా పసుపే. అందుకే కేటీఆర్ మెడలో వాళ్లు పసుపు కండువా కప్పారు. అయితే కేటీఆర్ పసుపు కండువా కప్పుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేటీఆర్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.