ఈటల జమునా రాజీనామా ఉపసంహరణ.. హుజురాబాద్ బరిలో 30 మంది

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా, ప్రధాన పార్టీలకు సవాల్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు నిలిచారు. బుధవారంతో హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజున 12 మంది అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరించారు. దీంతో ఉప ఎన్నికల బరిలో 30 మంది మిగిలిపోయారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇందులో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉండగా.. మరో ఏడుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. 20 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు హుజురాబాద్ ఉప సమరంలో పోటీలో నిలిచారు. 

బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి లింగారెడ్డి కూడా నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సుమన్, వినోద్ కుమార్, మల్లిఖార్జున్, నూర్జహాన్ బేగం తదితరులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 30 మంది బరిలో ఉండటంతో పోలింగ్‌ కోసం మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల సంఘం ఉపయోగించనుంది.  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఈ నెల 30న జరగనుంది.