రేవంత్ కు జై కొట్టిన చిన్నా రెడ్డి.. సీనియర్లంతా దారిలోకి వచ్చినట్టే! 

ఒక్క కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే కాదు, అన్ని పార్టీలలో అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తులు ఉంటారు. కాంగ్రెస్ వందేళ్ళ పార్టీ. అదీగాక, ఇప్పుడు జాతీయ స్థాయిలో  తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పార్టీ. కాబట్టి, కాంగ్రెస్’ లోఅసంతృప్తి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, అది శాశ్వతం కాదు. కొన్ని సందర్భాలలో పాల పొంగులా చల్లబడుతుంది. ఇంకొన్ని సందర్భాలలో కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా, చివరకి .. ‘అల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’ అనంట్లుగా కాంగ్రెస్ పార్టీలో అలకలు, అసంతృప్తుల కథలన్నీ సుఖాంతమే అవుతుందని చరిత్ర చెపుతోంది. 

కాంగ్రెస్ పార్టీ మీద అలిగి సొంత పార్టీలు పెట్టుకున్న కొందరు తిరిగి సొంతగూటికి చేరుకున్న సంఘటనలు కొకొల్లలు ... ప్రణబ్ ముఖర్జీ మొదలు మూపనార్, చిదంబరం వరకు, అనేక మంది జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు కూడా  ఎదో ఒక బలహీన క్షణంలో అసంతృప్తితో పార్టీని వదిలి,సొంత కుంపట్లు పెట్టుకున్నవారే.. కానీ, వెళ్ళినంత వేగంగా గోడకు కొట్టిన్ బంతిలా మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. పవార్, మమత, జగన్ రెడ్డి వంటి కొందరు అవసరార్ధం సొంత కుంపట్లు కొనసాగిస్తున్నా,మాతృ సంస్థతో ఉన్న పేగు బంధాన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఇక ప్రస్తుతంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏకంగా 23 సీనియర్ నాయకులు, ఇంచుమించుగా అందరూ కేంద్ర మాజీ మంత్రులు, జీ 23 గ్రూపుగా ఏర్పడి పార్టీ నాయకత్వం పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. జీ 23 అంటే, జీ హుజూర్ కాదు,అంటూ, పార్టీ అధినాయకత్వాన్ని నిలదీశారు. అయితే, మరో మూడు రోజుల్లో, అక్టోబర్ 16న పార్టీ నాయకత్వం విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సీ డబ్క్యూసీ) సమావేశం అవుతున్న నేపధ్యంలో జీ 23 నేతలు ఒకరొకరు మెత్త పడుతున్నారు. ఈ రోజు (బుధవారం) లఖింపూర్ దుర్ఘటన ఫై ..రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా నాయకత్వంలో రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నాయకుల బృందంలో, జీ 23 కీలక నేత గులాంనబీ ఆజాద్ కూడా ఉన్నారు. అంటే, నాయకత్వ మార్పు విషయంలో అయన మెట్టుదిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అలాగే,కర్ణాటకకు చెందిన మరో సీనియర్ నాయకుడు,వీరప్పమొయిలీ కూడా, కాంగ్రెస్ అధి నాయకత్వం  సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు అంగీకరించిన నేపధ్యంలో,అందరం కలిసి పార్టీని బతికించు కుదామని పిలుపు నిచ్చారు. 

జాతీయ స్థాయిలో పరిస్టితి అలా ఉంటే, రాష్ట్ర స్థాయిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫై కస్సు బుస్సుమంటున్న సీనియర్ నాయకులు, ఒకరొకరుగా మెత్తపడుతున్నారు. తాజాగా, రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నా రెడ్డి అసంతృప్తి అటకెక్కించారు. అంతే కాదు రేవంత్ రెడ్డి సీఎం అవుతారంటూ చిన్నారెడ్డి జోస్యం కూడాచెప్పారు.1985 లో తాను వనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి విద్యార్ధిగా ప్రచారంలో పాల్గొన్నారని. అలాంటి రేవంత్ రెడ్డి పీసీసి చీఫ్ కావడం గొప్ప విషయమని అభినందించారు. నిజాం పాలన ముగిసిన తర్వాత ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయనది పాలమూరు జిల్లా అని గుర్తు చేసిన చిన్నారెడ్డి.. ఇప్పుడు మరోసారి అదే ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇలా జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రంలో హస్తం పార్టీలో అసంతృప్తి చల్లారుతోందని, ఇదొక శుభ పరిణామని,  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.