నిక్కరుకు నిప్పు రగులుతున్న అగ్ని
posted on Sep 12, 2022 10:41PM
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న `భారత్ జోడో యాత్ర’ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త వివాదాన్ని వెంట తీసుకు పోతోంది. రాహుల్ గాంధీ ధరించిన టీ షర్టుతో మొదలైన, రాహుల్ గాంధీ వివాదాల యాత్ర, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ( ఆర్ఎస్ఎస్) స్వయం సేవకులు గణవేష (డ్రెస్)లో భాగంగా ధరించే ఖాకీ నిక్కరుకు నిప్పు పెట్టడం వరకు వెళ్ళింది.
రాహుల్ గాంధీ, మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేషాన్ని రగిలిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రేమను సోదరభావాన్ని పంచుతోందని పేర్కొన్నారు. అన్నిటినీ మించి, దేశంలో విద్వేషాన్ని పారద్రోలి, ఐక్యతను పెంపొందింప చేయడం కోసమే రాహుల్ గాంధీ `భారత్ జోడో యాత్ర’ చేపట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు కుంటున్నారు. కానీ, ఆయన యాత్ర ముదుకు సాగుతున్న క్రమంలో, యాత్ర ప్రకటిత లక్ష్యం వెనకడుగు వేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న క్రైస్తవ మత ప్రచారకునితో రాహుల్ గాంధీ సమావేశం కావడం పెద్ద దుమారమే రేపింది.
ఇప్పడు తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)నుదృష్టిలో ఉంచుకొని మండుతున్న ఖాఖీ నిక్కర్’ను కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ పట్ల ఆర్ఎస్ఎస్, బీజేపే, సంఘ్ పరివార్ సంస్థల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్వీట్ వైరల్ అయిన వెంటనే, బిజెపి నాయకులు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. వెంటనే చిత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సహకార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య దీనిపై స్పందిస్తూ రాహుల్ గాంధీ ముత్తాత, నానమ్మ, నాన్న(నెహ్రూ, ఇందిరా గాంధీ,రాజీవగాంధీ) కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను మట్టు పెట్టేందుకు విఫల ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.
ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ధరించే ఖాకీ నిక్కరుకు నిప్పు పెట్టిన.చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా, ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో సృష్టించిన విద్వేషాన్ని అంచెల వారీగా అంతమొందించే లక్ష్యగా అడుగులు వేస్తున్నాం అని పేర్కొంది. అందులో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ధరించే నిక్కర్ ను విద్వేషానికి ప్రతీకగా చూపించింది.
కాగా, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ రాజకీయ వారసుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా, దేశంలో విద్వేషం రగిల్చి, తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేస్తోందకుంటోంది అని ఆర్ఎస్ఎస్ ధ్వజమెత్తింది.
రాయపూర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మూడు రోజుల సమన్వయ సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ కీలక నేత (సహ సర్ కార్యవాహ) డాక్టర్ వైద్య మాట్లాడుతూ సమాజంలో హిందుత్వానికి ఆదరణ పెరుగుతోందని, అందుకే, కుహన లౌకిక వాదులు మతాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ పై గతంలో రెండుసార్లు అకారణంగా నిషేధం విధించారని, కానీ ఆర్ఎస్ఎస్ దేశ ప్రజల మనసు గెలుచుకుంటూ మరింత విస్తరిస్తోందని, డాక్టర్ వైద్య తెలిపారు. సత్యం, సిద్ధాంతం, త్యాగం, పరిశ్రమ, బలిదానం ద్వారా సంఘ్ సమాజం మద్దతు పొందుతోందని స్పష్టం చేశారు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, ఈ ట్వీట్ కాంగ్రెస్ సిగ్గుపడే మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన అసలు ఉద్దేశాలను కూడా దాచడం లేదు.భారత్ జోడో వేషంలో, భారత్ తోడోలో మునిగితేలుతోంది. జాతీయ వాదులను దెబ్బతీయాలనే వారి ఉద్దేశాలను భారతదేశం క్షమించదు అంటూ ట్వీట్ లో హెచ్చరించారు.అలాగే, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఇది భారత్ జోడో యాత్ర’ కాదు, భారత్ తోడో ఆగ్ లగావో యాత్ర అంటూ విరుచుకుపడ్డారు.
బీజేపీ ఐటీ అధినేత అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. కేవలం 5 రోజుల్లోనే కాంగ్రెస్ తన కోరలను బయటపెట్టుకుంది. నెల్లీ నుండి భాగల్‌పూర్ వరకు, ఖైర్లాంజీ నుండి గోద్రా వరకు, హషీంపురా నుండి సిక్కుల మారణహోమం వరకు వ్యవస్థీకృత హింసతో వర్ధిల్లిన పార్టీ, ఎప్పటికీ జోడో భారత్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణ బెంగళూరు ఎంపీ తేజశ్వి సూర్య, ఈ చిత్రం కాంగ్రెస్ రాజకీయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నైజంలోనే, హింస దాగుందని అన్నారు. 1984లో ఢిల్లీని కాంగ్రెస్ అగ్నికి ఆహుతి చేసింది. 2002లో గోద్రాలో 59 మంది కరసేవకులను సజీవ దహనం చేసింది.ఇప్పుడు మళ్ళీ మరో మారు అగ్గి రాజేసే కుట్రలకు పాల్పడుతోందని అన్నారు. కాంగ్రెస్ మాజీ నేత, జితిన్ ప్రసాద రాజకీయ విభేదాలు సహజం కానీ, రాజకీయ ప్రత్యర్థులను అగ్నికి ఆహుతి చేసే అలోచన దేనికి సంకేతం ఇది ఏ విధమైన మనస్తత్వం? అంటూ ప్రశ్నించారు. ఇటువంటి ప్రతికూల, ద్వేష రాజకీయాలను అందరూ ఖండించాలని స్పష్టం చేశారు.
నిజానికి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నాయకులు, భారత్ జోడో యాత్ర రాజకీయ యాత్ర కాదని ప్రకటించారు, కానీ, ఇంకా ఒక వారం అయిన కాకుండానే రాహుల్ యాత్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విద్వేషాలను తగ్గించే ఉద్దేశంతో మొదలైన యాత్ర, మెజారిటీ ప్రజల మనోభావాలను దేబ్బ తీసే విధంగా, విద్వేషాలను పెంచి పోషించే దిశగా సాగుతోందనే సందేహాలు కాంగ్రెస్ వర్గాలు కూడా వ్యక్త పరుస్తున్నాయి.