ఖమ్మం బీఆర్ఎస్ లో గందరగోళం

అధికారం పోయినా కొనసాగుతున్న వర్గపోరు

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో  ముఠాల పోరు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది..అధికారం పోయినా నాయకుల్లో ఐక్యత కనిపించడం లేదు… కొన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు అడ్రెస్ లేకుండా పోయారు.. సత్తుపల్లి, పాలేరు మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై పని చేస్తున్నారు. మధిరలో మాజీ జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అప్పుడప్పుడు తాను ఉన్నానని నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హైదరాబాద్ లో ఉంటూ ఏదైనా పార్టీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో మాత్రమే వచ్చి పాల్గొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో అక్కడ పార్టీకి ఎవరూ దిక్కు లేకుండా పోయారు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు కొద్దోగొప్పో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైరా నియోజకవర్గంలో గతంలో వర్గపోరుతో అధికార అభ్యర్థిని ఓడించి ఇండిపెండెంట్ ను గెలిపించారు. ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే ను కాదని మాజీ ఎమ్మెల్యే మనల్ లాల్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఓవర్గం వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇప్పటికీ అక్కడ అదే పరిస్థితి కొనసాగుతోంది. 

కొత్తగూడెం లో పార్టీలో ముఠా కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరావు ను మార్చాలనే డిమాండ్ ఎన్నికల ముందు నుంచి ఉంది. దీని పర్యవసానమే అక్కడ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా మూడో స్థానానికి పరిమితమయ్యారు. పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హల్ చల్ చేశారు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.. ఖమ్మంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా మంత్రి అజయ్ కుమార్ అండ చూసుకొని కొందరు కార్పొరేటర్లు చేసిన దందాల వల్ల జరిగిన నష్టం ఇంకా పార్టీని వెంటాడుతూనే ఉన్నది. అధిష్ఠానం కూడా జిల్లాలో ఉన్న కుమ్ములాటలను అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు. దాని పర్యవసానంగా జిల్లాలో రెండు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది. 2014 నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ ఒక్కసీటునే గెలిచింది.. 2014 లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్, 2023లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు.

2018 ఎన్నికల్లో ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకొని బలమైన నాయకులు కూడా ఓడిపోయారు. ఆతరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. చివరకు 2023 ఎన్నికల్లో వారిద్దరికీ పార్టీ టికెట్లు నిరాకరించింది. దాంతో వారిద్దరూ కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రులు అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో బలమైన నాయకత్వం లేదు. ఉమ్మడి జిల్లాలో కిందిస్థాయి నాయకులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చే నాయకులు లేరు. దీంతో అధికారం లేకపోవడం నాయకుల మధ్య సమన్వయం కొరవడటం వల్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంటోంది. కొందరు నాయకులు మాత్రం తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.