వైకాపాకే ఓటు.. దేవుడి మీద ఒట్టేయించండి.. వలంటీర్లకు ధర్మాన ఆదేశం!
posted on Apr 18, 2023 1:52PM
వాలంటీర్లు.. జగన్ సర్కార్ వారిని ప్రభుత్వ వేతనాలిచ్చి మరీ పార్టీ కార్యకర్తలుగా పని చేయించుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు జనానికి మొహం చూపించలేని పరిస్థితులు ఉండటంలో పార్టీ తరఫున వాలంటీర్లనే జనాలలోకి పంపించేందుకు వైసీపీ ఇసుమంతైనా వెనుకాడటం లేదు. ఈ విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు రెండడుగులు ముందుకు వేసి వారినే తమ ఎన్నికల ప్రచార కర్తలుగా వాడేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఏం చేసినా ఫర్వాలేదన్న సంకేతాలిస్తున్నారు. బెదరించండి.. బతిమాలండి ఏమైనా సరే జనం ఓట్లు వైసీపీకే పడాలి అని వారికి హుకుం జారీ చేశారు. ఇంతకీ ఆయన వాలంటీర్లకు చేసిన ఉపదేశం ఏమిటంటే...
రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు వైకాపాకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని చిత్రపటంపై వారితో ఒట్టు వేయించండి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లకు ఆదేశించారు. శ్రీకాకుళంలో వాలంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి మంత్రి ఈ వ్యాఖలు చేశారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించేందుకు మూడు పద్ధతులు అనుసరించాలని ఆయన వాలంటీర్లకు చెప్పారు. ప్రజలను ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైసీపీకి వేసేవారిని, బీలో వైసీపీకి ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలన్నారు. తెదేపాకు ఓటువేసే ఒక్క కుటుంబాన్ని వైకాపా వైపు వాలంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు పడతాయన్నది ఆయన ఉవాచ.
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరన్న అంశాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైసీపీ ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలి. ఎవరైనా వినకపోతే కుటుంబ పెద్దలను కలిసి మాట్లాడాలి. కొందరు కులపెద్దల మాట వింటారు. అలాంటివారిని గుర్తించి కులపెద్దలతో మాట్లాడాలి. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలి అని ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా జనంలో మా పట్ల సదభిప్రాయం లేదు. అందుకే మిమ్మల్ని వెళ్ల మంటున్నాం అని కూడా చెప్పేశారు.
ఒక వేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఉండవని ధర్మాన బెదరించడానికి కూడా వెనుకాడలేదు. వాలంటీర్లు వైకాపా కోసం కష్టపడి పనిచేయాలి. అలా చేయలేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపోండని కూడా హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం మేలు చేసింది.. భవిష్యత్తులో కూడా చేస్తుందని ఓటరు భావిస్తే.. తప్పకుండా ఓటేసి, మళ్లీ ఆ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారు. ఇలా దేవుడు.. ఒట్లు..ప్రమాణాలు.. అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడితే ఎట్లా..? అని వాలంటీర్లే అంతర్గత సంభాషణల్లో విసుక్కుంటున్నారు. ఇంతకీ కొసమెరుపేమిటంటే.. ధర్మాని అత్యంత కీలకంగా భావించి ఏర్పాటు చేసిన ఈ వాలంటీర్ల సమావేశానికి దాదాపు 60 మంది వాలంటీర్లు డుమ్మా కొట్టారు.