జగనన్నే భవిష్యత్ అని ఆర్కే భావించడం లేదా?
posted on Apr 18, 2023 2:16PM
జగనన్నే మా భవిష్యత్ అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నమ్మడం లేదా? అందుకే ఆయన ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టేశారా? అంటే మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికులు ఔననే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి ఏప్రిల్ 7న శ్రీకారం చుట్టారు. ఈ నెల 29 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంటే మరో మూడు రోజులలో జగనన్నే మా భవిష్యత్ అన్న కార్యక్రమానికి ఫుల్ స్టాప్పడనుంది.
సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ఇంటింటికి వెళ్లి.. నువ్వే మా నమ్మకం జగనన్న అని ఉన్న స్టిక్కర్లను ఇళ్లకు, సెల్ ఫోన్లకు అతికిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు తీరును ఎమ్మెల్యేలు.. పర్యవేక్షించడమే కాకుండా.. వారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలకు అందుతోన్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. కానీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు కూత వేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం.. పెద్దగా కనిపించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె (ఆళ్ల రామకృష్ణారెడ్డి) అయితే మొత్తంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇప్పటి వరకూ ఆళ్ల రామకృష్ణారెడ్డి నువ్వే మా నమ్మకం జగనన్నా కార్యక్రమంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆర్కే అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది. ఏఫ్రిల్ 20వ తేదీతో ముగియనున్న ఈ కార్యక్రమంలో చివరి రోజున ఆర్కే వచ్చి గంటకొట్టి మంగళహారతులిచ్చేసి మ..మ..అనిపించేఅవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులుచెబుతున్నాయి.
2014 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో.. నాడు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే... పక్కా రెబల్‌గా ఉండేవారని.. కానీ 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించినా.. ఆళ్లలో మాత్రం నాటి ఊపు ఉత్సాహం పూర్తిగా అవిరైపోయింద అంటున్నారు. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నారా లోకేశ్‌ను ఓడించి.. ఆర్కేను గెలిపిస్తే... తన కేబినెట్‌లోకి అతడికి బర్త్ కన్ ఫార్మ్ అంటూ పార్టీ అధినేత జగన్.. అప్పటి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తమ ఎమ్మెల్యే మంత్రి అవుతాడుగా అని భావించిన మంగళగిరి ప్రజానీకం ఆర్కేను గెలిపించారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పునర్వ్యవస్థీకరణలో సైతం జగన్ ఆర్కేను కన్సిడర్ చేయలేదు. దీంతో ఆర్కేలో అసంతృప్తి గూడు కట్టుకొని ఉందని ఆయన వర్గం పేర్కొంటోంది.
జగన్ తొలి కెబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం తనకు చోటు దక్కకపోవడంతోపాటు.. మంగళగిరికి కూతవేటు దూరంలో ఉన్న చిలకలూరిపేట నుంచి గెలుపొందిన విడదల రజినీని మాత్రం.. వైయస్ జగన్ తన కేబినెట్‌లోకి తీసుకోన్నారు. ఇలా పార్టీ మారి.. అలా వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా మంత్రిని చేయడం.. ఆర్కేకు ఏమాత్రం మింగుడు పడని వ్యవహారంగా మారిందని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ఈ ఆర్కే.. మంగమ్మ మార్క్ శపథం సైతం చేశారనే చర్చ నియోజకవర్గంలో జోరందుకొంది.
మరోవైపు.. సదరు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత గంజి చిరంజీవిని.. ఫ్యాన్ పార్టీలో చేర్చుకున్నారు. సీఎం వైయస్ జగన్. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా చిరంజీవి బరిలో దిగుతారనే ఓ టాక్ సైతం వాడీ వేడిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతోన్నట్లు... ఆ క్రమంలో ఈ విషయాన్ని పార్టీ పెద్దల చెవిలో వేసినా జగన్ లైట్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే జగనన్నే మా భవిష్యత్తు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావించడం లేదనే ఓ చర్చనియోజకవర్గంలో సాగుతోంది.