బీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ క్లారిటీ!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ పై అపారమైన ప్రేమకు కారణమేమిటన్నది రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎనిమిదేళ్లుగా అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచీ అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు.. రాష్ట్రంలో మారిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహనకు రాలేకపోతున్నారు. మరో సారి విపక్షంలో కూర్చోవడం కంటే.. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందని వారు భావిస్తున్న బీఆర్ఎస్ తో ఎలాగోలా పొత్తు కుదుర్చుకుంటే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  

అందుకే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులను అనుభవించిన జానా వంటి నేతలు  బీఅరేస్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. తమ పలుకుబడి అంతా ఉపయోగించైనా సరే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు ముడి వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలపై ఆశలు లేకపోవడం ఒక కారణమైతే.. ఒక వేళ అధికారంలోకి వచ్చినా ఆ క్రెడిట్ అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందన్న దుగ్ధ మరో కారణమని పరిశీలకులు అంటున్నారు. సీనియర్ల ఈ తీరు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చంద్రంగా మారిందని విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీనియర్ల ప్రకటనలకు ఇక్ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాందీ నడుం బిగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని హస్తినకు తిరిగి వేళ్లే క్రమంలో ఆయన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కొద్ది సేపు ఆగారు. ఆ సందర్భంగా తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో ఆయన ముచ్చటించారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ తో పొత్తు అంటూ ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి నేతలు చేసిన ప్రకటనలను ప్రస్తావించి.. అటువంటి అవకాశమే లేదని తేల్చేశారు. రాష్ట్రంలో ఒంటరిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే.. లక్ష్యమని విస్పష్టంగా చెప్పారు.

కర్నాటక ఎన్నికలు పూర్తి కాగానే.. తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలూ కాంగ్రెస్ కు ప్రత్యర్థులేనని విస్పష్టంగా తేల్చేశారు. రాహుల్ ఈ విధంగా పార్టీ స్టాండ్ ను విస్పష్టంగా తేల్చేయడంతో ఇక సీనియర్లు ఏ విధంగా చూస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, సీనియరేతర్లు అన్నట్లుగా నిట్టనిలువుగా చీలిపోయింది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే వచ్చిన తర్వాత. గాంధీ భవన్ వాతావరణంలో కొంత మార్పు వచ్చి, నాయకుల మధ్య విభేదాలు అలాగే  ఉన్నా.. ఎవరి దారిన వారు పాద యాత్రలు, ఇతర కార్యక్రమాలలో బిజీ అయి పోయారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గాడిన పడిందని అంతా భావిస్తున్నా.. ఆ బావన తప్పు అంటూ   జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి వారు బీఆర్ఎస్ తో పోత్తు అంటూ ప్రకటనలు చేస్తూ.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటూ గుర్తు చేస్తున్నారు.

జానారెడ్డి ఇటీవల పొత్తు గురించి ప్రస్తావిస్తే.. ఆయన కంటే చాలా ముందు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే  అవకాశం ఉందని అన్నారు.  బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ బీఅరేస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని  హస్తిన  వేదికగా సంచలన ప్రకటన చేసి    పార్టీలో సునామీ సృష్టించారు. అయితే ఆ తర్వాత  రాష్ట్ర ఇన్ చార్జి ఠాక్రే జోక్యం చేసుకుని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.   ఇప్పడు మళ్ళీ అదే విషయాన్ని మరో  సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పెద్దలు అంటూ  గౌరవంగా సంభోదించే మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేవనెత్తి  తేనె తుట్టెను కదిల్చారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ  సీనియర్లు  కారుతో షికారు కావాలంటున్నారు.  ఈ పరిస్థితుల్లో  రాహుల్ గాంధీ స్వయంగా బీఆర్ఎస్ తో పొత్త ప్రశక్తే లేదని స్పష్టం చేయడంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా పార్టీ నుంచి సీనియర్లు బయటకు వెళ్లడానికి దారితీస్తుందా వేచిచూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu