పప్పులో కాలేసిన పాక్..ఎర్రకోట పాకిస్థాన్ దట...
posted on Jun 15, 2017 11:40AM

ఎర్రకోట పాకిస్థాన్ దట. ఇంతకీ ఎవరనుకుంటున్నారబ్బా అనుకుంటున్నారా..? పాకిస్థానే ఆ విషయం చెప్పుకొచ్చింది. గొప్పలకు పోయి పాక్ పప్పులో కాలేసింది. అసలు సంగతేంటంటే.. చైనాలోని ఆస్థానాలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను అందులో ప్రదర్శిస్తున్నారు. చైనాలోని షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) అనే సంస్థ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఇండియా, పాక్ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా... ఎర్రకోట తమదేశంలో ఉందని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఫొటోను చూపించారు పాక్ ప్రతినిధి మసూద్ ఖలీద్. ‘మొఘలుల కాలంలో వారి మేధోసంపత్తికి ఈ నిర్మాణాలు నిదర్శనం’ అంటూ భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న ఎర్రకోట ఫొటోను చూపిస్తూ ‘ఇది లాహోర్ లోని షాలిమార్ గార్డెన్స్ లో ఉంది’ అని చెప్పుకొచ్చారు. కనీసం కోటపై రెపరెపలాడుతున్న భారత జెండాను కూడా చూసుకోకుండా పప్పులో కాలేశారు. దీంతో అక్కడ ఉన్న భారత, పాక్ అధికార ప్రతినిధులు, రాయబారులు అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకులకు తెలిపి గుర్రుమన్నారు. దీంతో ఎస్‌సీవో అధికారులు జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు.