లిక్కర్ స్కామ్.. కవిత చూట్టూనే ఎందుకు?

దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు సంభవించినా.. వాటి మూలాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్నట్లు.. దేశ రాజధాని హస్తిన వేదికగా జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూలలు అదే తెలంగాణలో ఉన్నాయా? అనే సందేహం ఆ రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని.. ఆ క్రమంలో ఆమెకు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవంటూ సోషల్ మీడియాలో కథనాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. అదుపులోకి తీసుకుని.. ప్రశ్నించి.. అతడిని అరెస్ట్ తీహార్ జైలుకు తరలించారు. అయితే ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇంకోవైపు ఈ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలకు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మెడలకు సైతం ఈ కేసు చుట్టుకొంది. దీంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్ చార్జ్ మంత్రి మనీష్ సిసోడియాతోపాటు మరో మంత్రిని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు తరలించారు.   

దేశవ్యాప్తంగా ఇంతలా ప్రకంపనలు సృష్టిస్తోందీ ఢిల్లీ లిక్కర్ స్కామ్... అలాంటి వేళ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమిటీ.. ఇది ఎప్పుడు జరిగింది.. ఎందుకు జరిగింది? ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఎవరికీ లాభం.. మరెవరికీ నష్టం.. ఇంతకీ ఈ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అంటే ఒక్క సారి వెనక్కి వెళ్లాలి.    

దేశ రాజధాని ఢిల్లీలో కొలువు తీరిన కేజ్రీవాల్ సర్కార్.. 2021, నవంబర్ 17న కొత్త లిక్కర్ పాలసీని అమలులోకి తీసుకు వచ్చింది. కొంత మంది నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమలు చేస్తున్నట్లు కేజీవ్రాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అంతేకాదు ఇది పూర్తి పారదర్శకతతో దేశంలోనే అత్యత్తమ పాలసీ అని సీఎం కేజ్రావాలే సైతం స్పష్టం చేశారు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగుతోందని.. అలాగే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని.. అంతేకాకుండా లిక్కర్ మాఫియతోపాటు బ్లాక్ మార్కెట్ విధానానికి పుల్ స్టాప్ పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 

మరోవైపు.. ప్రభుత్వ మద్యం అమ్మకాల్లో బ్లాక్ మార్కెట్‌ను నిలువరించడం కోసం.. మద్యం విక్రయాల ద్వారా రెవెన్యూ పెంచుకోవడం కోసం... మద్యం విక్రయాలను ఇకపై ప్రభుత్వం నిర్వహించకుండా.. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించడం.. ఆ క్రమంలో మద్యాన్ని హోం డెలివరీ చేయడం.. అలాగే తెల్లవారుజాము 3గంటల వరకు మద్యం షాపులు బార్లా తెరిచి ఉంచడం.. మద్యం షాపులకు లైసెన్స్‌లను విచ్చల విడిగా కట్టబెట్టడం.. మద్యం విక్రయాలపై డిస్కోంట్‌ను అన్‌లిమిటెడ్‌ అంటూ ప్రకటించుకొనే అవకాశం దుకణాల యజమానులకు కల్పించడం.. వంటి అంశాలకు చోటు కల్పించారు. అలాగే ఈ నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి 27 శాతం ఆదాయం పెరుగుతోంది.. అంటే అక్షరాల 8,900 కోట్ల రూపాయిల అధిక ఆదాయం ఢిల్లీ ప్రభుత్వానికి సమకూరనుంది. అయితే ఈ లిక్కర్ పాలసీపై పౌర సమాజంతోపాటు వాటి అనుబంధం సంఘాలు.. పలు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, విద్యా సంస్థలతోపాటు వివిధ  సంఘాలు, సంస్థలు సైతం తీవ్రంగా వ్యతిరేకరించాయి. 

ఇంకోవైపు ఈ ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ.. జీఎన్‌సీటీడీ యాక్ట్ 1991, టీఓబీఆర్ 1993, ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్ 2009, ఢిల్లీ ఎక్సైజ్ రూల్ 2010లకు తూట్లు పొడిచే విధంగా ఉందంటూ 2022, జులై 8వ తేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనాకు ఢీల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించారు. అలాగే ఈ లిక్కర్ పాలసీలో డిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి మనీష్ సీసోడియా అనుసరించి విధి విధానాలతోపాటు తీసుకున్న కీలక నిర్ణయాలను సైతం ఈ నివేదికలో పొందు పరిచారు. ఈ నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన లిక్కర్ పాలసీ 2021 - 2022పై విచారణ జరపాలని సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ లేఖ రాశారు. 

అయితే ఈ ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీపై విచారణ జరిపించాలంటూ సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడంతో... ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఇన్ ఛార్జ్ మంత్రి మనిష్ సిసోడియా వెంటనే స్పందించారు...  మద్యం విక్రయదారులను బెదిరించేందుకు బీజేపీ తన నియంత్రణలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఆ క్రమంలో నూతన ఢిల్లీ లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపైనే ప్రస్తుత ఎల్జీ వీకే సక్సేనా, ఆయనకు ముందు ఉన్న ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజాల్‌పై ఈ సందర్భంగా మనీష్ సిసోడియా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఢీల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టడం.. అందులోభాగంగా మనీ ల్యాండరీంగ్ జరిగినట్లు గుర్తించడంతో... ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి.. మనిషీ సిసోడియాతోపాటు ఆయన బంధువులు, సన్నిహితల ఇళ్లు కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. అలా ఈ కేసుకు సంబంధించిన తయారు చేసిన చార్జ్ షీట్‌లో తెలుగు రాష్టాలకు చెందిన పలువురు నేతల పేర్లు వచ్చి చేరాయి. 

అలా ఈడీ అధికారుల చేపట్టిన దర్యాప్తులో సౌత్ గ్రూప్ అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు లిక్కర్ లాబీగా ఏర్పడి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు రూపాయిల నగదును ముడుపుల కింద ఇచ్చారని.. ఆ నగదును గోవా ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించుకొందని.. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట ఓ వ్యాపారవేత్త పేర్కొన్నారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సైతం ఈడీ విచారించి.. మరింత సమాచారం సేకరించి.. అనంతరం అతడిని సైతం అరెస్ట్ చేసింది. 

అయితే ఢిల్లీని 32 ఎక్సైజ్ జోన్లుగా విభజించి.. వాటిలో 849 షాపులు ఏర్పాటు చేసుకునేందుకు రిటైల్ లిక్కర్ లైసెన్లు ప్రైవేట్ వ్యక్తులకు అందజేయడం ద్వారా.. మద్యం విక్రయ వ్యాపారం నుంచి ఢిల్లీ ప్రభుత్వం బయటకు వచ్చేయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో మద్యం విక్రయించుకునే ప్రైవేట్ మద్యం దుకాణదారులకు పలు సడలింపులు సైతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మద్యం విక్రయాల సందర్భంగా ఎమ్‌ఆర్పీ ధరను పక్కన పెట్టి.. సొంతంగా రేట్లు నిర్ణయించే అధికారాన్ని సైతం వారికి కట్టబెట్టింది. ఆ క్రమంలో మద్యంపై ప్రత్యేక ఆఫర్లు సైతం ఇవ్వోచ్చని చెప్పకనే చెప్పినట్లు అయింది. 

మరోవైపు ఈ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసి.. విచారించింది. ఆ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు తాను ప్రతినిధిగా ఈ వ్యవహారంలో వ్యవహరించినట్లు ఈడీ ముందు ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. మరోవైపు కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానంటూ.. అరుణ్ రామచంద్ర పిళ్లై ప్రకటించడం ద్వారా ఆయన యూ టర్న్ తీసుకున్నట్లు అయింది. 
అదీకాక.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోని ఈ సౌత్ గ్రూప్‌ ఏర్పాటులో కల్వకుంట్ల కవిత ఉండడం వెనుక అరుణ్ రామచంద్రన్ పిళ్లై కీలక వ్యక్తిల్లో ఒకరుగా ఉన్నారని స్పష్టమవుతోంది. అలాగే ఈ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ, వైయస్ఆర్ సీపీ నాయకుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు ఎం రాఘవరెడ్డితోపాటు అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలు కూడా ఉన్నారు. 

ఇక ఇండో స్పిరిట్‌లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై 32.5 షేర్ హోల్డర్‌గా ఉన్నారు. దీంతో ఆయన ఎల్ 1 లైసెన్స్ కలిగి ఉన్నారు. ప్రేమ్ రాహుల్‌ 32.5 శాతం, అలాగే ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూట్ కంపెనీ లిమిటెడ్ 35 శాతం ఇతర బాగస్వాములుగా ఉన్నారు. మరోవైపు అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్‌లు.. కల్వకుంట్ల కవితతోపాటు మాగుంట రాఘవరెడ్డికి బినామీలుగా పెట్టుబడులు పెట్టారు. ఫిళైతోపాటు అతడి అసోసియేట్స్ అభిషేక్ బోయినపల్లి, గోరంట్ల బుచ్చిబాబు తదితరులు ... సౌత్ గ్రూప్ ఏర్పాటుతోపాటు ఈ మొత్తం లిక్కర్ స్కీమ్‌లో.... తయారీదారులు, హోల్‌సేల్, రిటైలర్లు ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించారు. ఇంకోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్.. విలువ మొత్తం పది వేల కోట్ల ఉంటుందని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.