తెరపైకి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం.. ఫలించేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిండా ఇరుక్కోవడంతో ఆమెను కాపాడుకోవాలన్నా, తెలంగాణ సమాజం నుంచి ఆమెకు సానుభూతి మద్దతును కూడగట్టాలన్నా సెంటిమెంట్ తప్ప మరో దారి లేదని కేసీఆర్ భావించారా? అందుకే బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి అటకెక్కించేసిన తెలంగాణ వాదాన్ని మళ్లీ కిందకు దించారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా.. రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలన్నా జాతీయ రాజకీయాల జపం కాదు.. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రమే ‘శ్రీరామ రక్ష’ అని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ జనంలో రగిలించాలని చూస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమ నేతగా తాను పడిన కష్టాన్ని, రాష్ట్రం సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలలో సాధించిన విజయాలను మరోసారి ప్రముఖంగా చాటుతూ జనంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఆయన జనాలకు ఓ బహిరంగ లేఖ రాశారు. పార్టీపై ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ లేఖ ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది.

గత కొంత కాలంగా అంటే  తాను జాతీయ రాజకీయాలలోని జంప్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తొలగించి భారత్ ను చేర్చి తెరాసను బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి కేసీఆర్ తెలంగాణ పదాన్ని బహిరంగంగా పలకడానికే ఇష్టపడటం లేదు. తెలంగాణ అస్త్రం నిర్వీర్యమైపోయిందని ఆయన భావించారో.. లేక నిర్వీర్యం చేయడమే తన జాతీయ రాజకీయాలలో చురుకుగా ముందుకు సాగడానికి దోహదం చేస్తుందనో కానీ ఆయన తెలంగాణ పదాన్ని తన వాడుకలో నిషేధిత పదాల్లోకి చేర్చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన సభలో ఎక్కడా తెలంగాణ సెంటిమెంట్ కనిపించకుండా, తలెత్తకుండా కేసీఆర్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.  తెలంగాణ అస్తిత్వ రాజకీయాలకు ఆ సభ వేదికగా గుడ్ బై చెప్పేశారు. అందుకే ఆ సభలో ఎక్కడా జై తెలంగాణ నినాదమే వినిపించలేదు.  అంతకు ముందు గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎక్కడ   సభ జరిగినా, జై తెలంగాణ నినాదమే ప్రధానంగా వినిపించేది.  ఆ నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేది.  కానీ ఖమ్మం సభ నుంచి జై తెలంగాణ స్థానంలో  జై భారత్ నినాదం వచ్చి చేరింది. కేసీఆర్ లోని ఈ మార్పును తెలంగాణ ప్రజానీకమే కాదు, ఉద్యమ కాలం నుంచీ పార్టీలో కొనసాగుతూ వచ్చిన వారు, తెరాస అధికారం చేపట్టిన తరవాత కేసీఆర్ పోకడలు నచ్చక దూరమైన వారూ, ఉద్యమకారులూ, మేధావులూ కూడా అప్పుడే వ్యతిరేకించారు. విమర్శలు గుప్పించారు.  

బీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ అస్థిత్వాన్ని లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. అయితే ఇప్పుడు సమస్య తన కుటుంబం దగ్గరకు వచ్చే సరికి కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను ఆశ్రయించారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ బహిరంగ లేఖల  కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడడానికి కారణం సమస్య తన కుటుంబం దగ్గరకు రావడమేనా అని ప్రజలలో చర్చ జరుగుతోంది. అంతేనా పార్టీ క్యాడర్ లో సైతం ఇప్పటి వరకూ సైడ్ చేసిన తెలంగాణ నినాదం, సెంటిమెంట్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అన్న చర్చ జరుగుతున్నది.   

బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత ‘తెలంగాణ’ పదం దూరమయ్యిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది. తెరాసను అక్కున చేర్చుకున్న విధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ ను తమ పార్టీగా భావించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.  ఆ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ఇప్పుడు కష్టం తన ప్రగతి భవన్ గుమ్మంలోకి రావడంతోనే కేసీఆర్ కు తాను వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం గుర్తుకు వచ్చిందా అని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అక్కర తీరిపోయిందని వదిలేసిన సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించినా ఫలితం ఉంటుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.