వేశ్యతో ప్రేమ.. త్వరలో పెళ్లి..
posted on Jul 7, 2017 12:51PM
.jpg)
అతనో డ్రైవర్.. సుఖం కోసం వేశ్యావాటికకు వెళ్లాడు.. అక్కడ ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. ఏంటీ ఇదేదో సినిమా స్టోరీలా ఉందనుకున్నారా..? ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో డ్రైవర్ గా పనిచేస్తున్న 28ఏళ్ల యువకుడు ఓ రోజు జీబీరోడ్డులో ఉన్న వేశ్వ గృహానికి వెళ్లాడు. అక్కడ ఓ గదిలోకి అడుగుపెట్టాడు. అయితే అక్కడ గదిలోకి వచ్చిన అమ్మాయిని చూసి అతని మనసు పారేసుకున్నాడు. దాంతో అప్పుడప్పుడూ ఆమెను కలవడానికి అక్కడికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడి నుండి ఆమెను బయటకు తీసుకురావడానికి అనేక మార్లు ప్రయత్నించినా కుదరకపోవడంతో.. అతను ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులను కలిసి ఆమెకు వేశ్యాగృహం నుంచి విముక్తి కల్పించాలని కోరాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్.. త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకుంటారని చెప్పారు. అంతేకాదు.. జీబీ రోడ్డు కేంద్రంగా రహస్యంగా ఇరుకు గదుల్లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న వ్యభిచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.