డిల్లీ గవర్నర్ పై రాష్ట్రపతికి పిర్యాదు చేయనున్న కేజ్రీవాల్

 

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య ప్రధాన కార్యదర్శి నియామకంపై మొదలయిన గొడవ నానాటికీ ముదురుతోంది. డిల్లీ ప్రధాన కార్యదర్శి కెకె శర్మ తన స్వంత పని కోసం కొన్ని రోజులు శలవు పెట్టి అమెరికా వెళ్ళడంతో ఆయన స్థానంలో శకుంతల గామ్లిన్ అనే ఐ.ఏ.యస్. అధికారిణిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాలు జారీ చేశారు. దాని కోసం ప్రధాన కార్యదర్శి (సర్వీసస్) మజుందార్ నోటిఫికేషన్ ఇచ్చేరు. కేజ్రీవాల్ వారిస్తున్నా వినకుండా శకుంతల గామ్లిన్ బాధ్యతలు చేప్పట్టారు.

 

ఈ మూడు సంఘటనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గవర్నర్ నజీబ్ జంగ్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకొంటున్నారని, ఆయన చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమని కేజ్రీవాల్ వాదన. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ శకుంతల గామ్లిన్ కి ప్రధాన కార్యదర్శిగా నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు మజుందార్ ని బాధ్యతల నుండి తప్పించి, ఆయన కార్యాలయానికి తాళాలు వేయడమే కాకుండా ఆయన స్థానంలో రాజేంద్ర కుమార్ అనే మరో అధికారిని నియమించారు.

 

కానీ మజుందార్ స్థానంలో ముఖమంత్రి నియమించిన రాజేంద్ర కుమార్ నియామకానికి తన అనుమతి లేదని కనుక ఆయన నియామకం చెల్లదని తెలియజేస్తూ గవర్నర్ నజీబ్ జంగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఒక లేఖ వ్రాయడంతో ఆయన మరింత ఆగ్రహం చెందారు.

 

తన ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసి ఏదోవిధంగా కూల్చివేయాలనే ఉద్దేశ్యంతోనే మోడీ ప్రభుత్వం ఈ విధంగా గవర్నర్ ద్వారా తనకు ఇబ్బందుకు సృష్టిస్తోందని అని విమర్శించారు. ఈ రోజు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వ్యవహారం గురించి పిర్యాదు చేయబోతున్నారు.