ఓటమి ఓ గుణపాఠమే!

ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలు అన్నీ మొదలుపెట్టే పనిలో గెలవాలనే చేస్తారు. ఆ ప్రయత్నాలలో ఎప్పుడూ విజయాలే కాదు ఓటమిలు కూడా ఎదురవుతాయి. మనం విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు

ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాలి. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను ఎప్పుడూ మరచిపోకూడదు. 

ఓటమి అనేది మనం విజయాన్ని ఎలా సాధించాలో తెలియజేస్తుంది. అంటే ఓటమితో దాగున్న గొప్ప గుణం అనుభవం. అనుభవం ఎదురైనప్పుడు మనం చేస్తున్న తప్పేమిటో చాలా తొందరగా అర్థమైపోతుంది. చాలామంది వారు చేసే పనులలో ఓటమి ఎదురయినప్పుడు ఓటమికి భయపడి ఆ పనిని చివరివరకు పూర్తిచేయకుండా వారు అనుకున్నది సాధించలేక వారి ఆశలను నిరాశలను చేసుకుంటున్నారు. చివరివరకు పనిని పూర్తిచేయడం అంటే ఓటమి ఎదురవ్వగానే ఇక ప్రయత్నం ఆపేయడం. అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. విఫలం అయిన ప్రతిసారి చేసిన తప్పేంటో అర్థం చేసుకుని అది తిరిగి పునరావృతం కాకుండా ముందడుగు వేయాలి. ఓటమి ఎదురయితే కృంగిపోకూడదు. అలాచేస్తే అది మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళుతుంది. ఆ డిప్రెషన్ వల్ల మనుషులకు కొన్నిరకాల చెడు వ్యసనాలు అలవాటు అవుతాయి. మనుషులు డిప్రెషన్ కి లోనైనప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు నచ్చిన వ్యక్తులను కలవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే నిరాశానిస్పృహల నుండి తొందరగా బయటపడవచ్చు. 

అసలు ఓటమి అంటే ఓడిపోవడమా??

కానే కాదు!! ఓటమి అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. గెలుపు ఇంకా అందుకోలేదని అర్ధం, గెలుపుకు తగిన సన్నద్ధత ఇంకా రాలేదని అర్థం. ఓటమి అంటే భయంతో అసలు పనిచేయకపోవడం కాదు. ఆ పని మరొక విధంగా చేస్తే బావుంటుందేమోనని ప్రయత్నించటం. కొన్నిసార్లు చేసే పనుల వల్ల  కూడా వైఫల్యాలు ఎదురవుతాయి. 

 పరాజయం అనేది ఉందా??

చాలామంది పరాజయాన్ని నిర్వచిస్తారు. గెలవలేకపోతే ఇక పరాజయం పాలైనట్టు చెబుతారు. కానీ అన్నీ మనం చేసే పనులకు వచ్చే ఫలితాలు మాత్రమే. మనం నిర్వహించే పని సరైనది అయినప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనం అనుకున్న ఫలితాలు సరిగారానప్పుడు చేసేపనిలో, పద్దతిలో మార్పు తీసుకురావడం ద్వారా కోరుకున్న ఫలితాలు వచ్చేంతవరకూ మార్పులు తీసుకువస్తూ ఉండాలి. అందువల్ల ఫలితాలే తప్ప పరాజయాలు లేవు. వచ్చే ఫలితాలు ఆశించినవి కాకపోవచ్చు కానీ అసలు పలితం అంటూ లేకుండా లేదు కదా!!

సముద్రంలో ప్రయాణం చేసే ఓడ తుఫానుని ఎదుర్కొనవలసి వస్తుందని భయపడి హర్భర్ లోనే ఉంచితే అది తుప్పుపడుతుంది. అప్పుడు ఓడను నిర్మించిన లక్ష్యం నెరవేరదు. ఓడను హార్బర్ లో పెట్టడానికి ఎవరూ తయారుచేయరు కదా!! దాన్ని తయారుచేయించుకున్న వ్యక్తి సముద్రంలో తిప్పుతూ డబ్బు సంపాదించాలని మాత్రమే కాదు, అది సముద్రంలో సమస్యకు లోనయ్యి నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగానే ఉంటాడు. అలాగే గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసేవాడు గెలుపుమీద ఆశతో ఉండాలి అలాగే ఓటమి ఎదురైతే దాన్ని స్వీకరించే మనసు కూడా ఉండాలి. 

 ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు. గెలవాలనుకొనేవారు అవకాశాలకోసం ఎదురు చూస్తారు. ఓటమి పొందటం నేరం కాదు. ఓటమికి అసలు కారణాలు తెలుసుకోలేకపోవటం అతిపెద్ద నేరం. ఓటమికి గల అసలు కారణాలు తెలుసుకోగలిగితే మనం సగం విజయాన్ని సాధించినట్లే. ఓటమి, విజయం ఈ రెండూ కూడా మన వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటాయి.

వ్యక్తిత్వపరంగా వ్యక్తిలోని లోపాలే వారికి విజయాన్ని దక్కకుండా చేస్తాయి. మన ఆలోచనలు, అలవాట్లు, చర్యలు, మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. మన లోపాలను సరిదిద్దుకుని మంచి నడవడికను మనదిగా చేసుకుంటే స్థిరమైన వ్యక్తిత్వం సొంతమవుతుంది. ఓటమి భయంతో నిర్ణయాలు తీసుకోకపోవటం తప్పు, ఓటమి రావటం తప్పుకాదు. కానీ ఆ ఓటమిని తలచుకుంటూ, కుమిలిపోతూ జీవిస్తూ, ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకపోవటం మరింత తప్పు.

                                        ◆నిశ్శబ్ద.