వైసీపీలో ముసలం .. చంద్రబాబుకు జై కొడుతున్న నేతలు

ఏపీలో  అధికార వైసీపీతో స‌హా టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఎన్నిక‌ల ర‌ణ‌రంగానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. గెలుపే ల‌క్ష్యంగా పార్టీల అధినేత‌లు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. వైసీపీ అధినేత‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. అయితే, ఆయ‌న వ్యూహాలు ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌డం లేద‌ని వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్త‌యింది.

ఈ నాలుగేళ్ల కాలంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆశించిన స్థాయిలో మేలు జ‌ర‌గ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లే  చెబుతున్న ప‌రిస్థితి. నాలుగేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను అరెస్టులు చేయించ‌డం, జైళ్ల‌కు పంపించ‌డం త‌ప్ప పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల మేలుకోసం చేసింది పెద్ద‌గా ఏమీలేద‌ని జనం గట్టిగా నమ్ముతున్నారు. ఇటీవ‌ల ఇంటింటికి వైసీపీ కార్య‌క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. త‌మ‌కు ఏం చేస్తున్నార‌ని ఇంటింటికి వ‌స్తున్నార‌ని ప‌లు చోట్ల‌ ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను నిల‌దీసిన ఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. 

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగేళ్ల కాలంలో ఏపీకి పెద్ద డ్యామేజ్ జ‌రిగింద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగంగా జ‌రిగాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు కూడా వేగంగా జ‌రిగాయి. ప్ర‌తీ సోమవారం చంద్ర‌బాబు పోల‌వ‌రం ప‌నుల‌పై స‌మీక్ష‌లు జ‌రిపి ప‌నులు వేగ‌వంతం అయ్యేలా ప్ర‌త్యేక దృష్టిసారించారు. ఇందు కోసం ఆయన సోమవారం ను పోలవారంగా మార్చుకున్నారు కూడా. అంతేకాక‌, ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీల‌ను సైతం ఒప్పించి రాష్ట్రానికి ర‌ప్పించారు. దీంతో ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధిపై దేశ‌ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏపీ దేశ‌ వ్యాప్తంగా న‌వ్వుల‌పాలవుతున్నద‌న్న చ‌ర్చ  విస్తృతంగా జ‌రుగుతున్నది. ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే త‌లదించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నామని, హైద‌రాబాద్‌, ఇత‌ర రాష్ట్రాల‌కు ఉద్యోగ రిత్యా వెళ్లిన వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నార‌ట‌. ప్ర‌జ‌ల్లో పార్టీపై వ్య‌తిరేక‌త చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగితే విజ‌యం సాధించ‌టం క‌ష్ట‌మ‌న్న భావ‌న‌కు ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని, చంద్ర‌బాబు వెంట ఉంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న భావ‌న‌కు ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తీరుతో విసుగుచెందిన నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు కీల‌క వైసీపీ నేత‌లు ఆ పార్టీ రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటి నేత‌లు చంద్ర‌బాబుకు జై కొట్టారు. ఈ ముగ్గురు నేత‌లు టీడీపీ యువనేత‌ లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో పాల్గొని జ‌గ‌న్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనేన‌ని, ప్ర‌జ‌లంతా టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.   

నెల్లూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలే కాకుండా రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ వైసీపీ ఎమ్మెల్యేలు అవ‌కాశం దొరికితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ నుంచి బ‌రిలో నిలిస్తే ఎలాగూ విజ‌యం సాధించ‌లేమ‌న్న భావ‌న‌కు స‌ద‌రు ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. వైసీపీ ఎంపీ సుభాష్ చంద్ర‌బోస్, ఆయన కుమారుడు సూర్య‌ప్ర‌కాశ్‌లు వైసీపీని వీడుతున్నార‌నీ, వారు త్వ‌ర‌లో టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నీ ప్ర‌చారం జ‌రుగుతుంది. చంద్ర‌బాబుకు జై కొడితే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న భావ‌న‌కు వారు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కాకినాడ జిల్లా జ‌గ్గంపేట వైసీపీలో ముస‌లం మొద‌లైంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మ‌ధ్య వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. వీరిలో ఒక‌రు చంద్ర‌బాబుకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీలో కొన‌సాగేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, వారంతా చంద్ర‌బాబుకు జై కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. జ‌గ‌న్ క‌క్షపూరిత రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు తెచ్చుకోవ‌టం కంటే చంద్ర‌బాబు వెంటఉంటేనే ప్ర‌జ‌ల మద్ద‌తు ల‌బిస్తుంద‌న్న భావ‌నలో ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తే వారు టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu