క్రికెట్ ఆదాయం క్లీన్‌బౌల్డ్
posted on Apr 20, 2015 4:45PM
ఆంగ్ల రచయిత బెర్నార్డ్ షా చచ్చి ఏ లోకాన వున్నాడోగానీ, ఆయన బతికున్నప్పుడు క్రికెట్ గురించి బంగారం లాంటి మాట చెప్పాడు. 11 మంది ఫూల్స్ ఆడుతుంటే, 11 వేల మంది ఫూల్స్ చూసే ఆట క్రికెట్ అని స్టంపింగ్ చేసినట్టు క్లియర్‌గా చెప్పేశారాయన. ఈ మాట చాలామంది క్రికెట్ పిచ్చోళ్ళని హర్ట్ చేయొచ్చేమోగానీ, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ క్రికెట్ రంగంలో వున్న అనేక అనారోగ్యకర ధోరణులను చూస్తూ వుంటే జార్జ్ బెర్నాడ్ షా చెప్పింది అక్షర సత్యం అని అనిపిస్తూ వుంటుంది. మానసికోల్లాసం కోసమంటూ ప్రారంభమైన ఈ క్రీడ ఇప్పుడు ‘మనీ’సికోల్లాసం కోసం అన్నట్టుగా తయారైంది. ఆ కప్పు, ఈ కప్పు, ఆ టోర్నీ, ఈ టోర్నీ అంటూ రకరకాలుగా క్రికెట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేసి స్పాన్సర్ షిప్పులు, ఈ షిప్పులు, ఆ షిప్పులు అంటూ బాగా డబ్బు దండుకోవడం క్రికెట్ సంస్థలకు షరా మామూలు అయిపోయింది. క్రికెటర్లు మైదానంలో ప్రవహించజేసే పరుగుల సంగతేమోగానీ, క్రికెట్ పేరుతో జరుగుతున్న డబ్బు ప్రవాహాన్ని చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి, క్రికెట్ పేరుతో జనాల జేబులకు పెడుతున్న చిల్లులు చూస్తుంటే గుండెలు అదురుతాయి. అయితే క్రికెట్‌లో డబ్బు ప్రవాహం అనేది మొన్నామధ్య వరకూ టూమచ్‌గా వుండేది. ఈమధ్యకాలంలో ఆ ప్రవాహం బాగా తగ్గిపోయిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. క్రికెట్ నుంచి భారీగా ఆదాయం పొందడానికి రకరకాలుగా ప్రయత్నించే మన ఇండియాకి చెందిన బీసీసీఐ బొచ్చెలో ఈమధ్యకాలంలో పెద్దపెద్ద రాళ్ళు పడ్డాయి. దాంతో ఇండియాలో క్రికెట్ మానియాతోపాటు, క్రికెట్ మనీ కూడా తగ్గిపోతోందని బీసీసీఐ పెద్దలకి అర్థమైపోయింది.
ఈమధ్య బీసీసీఐ వాళ్ళు తమ ఆదాయం లెక్కలు వేసుకుని కళ్ళు తేలేశారు. వాళ్ళకి తక్కువ ఆదాయం రావడంతో ఆటగాళ్ళకు వెళ్ళే వాటా కూడా బాగా తగ్గిపోయింది. 2012 - 13 సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో 49 కోట్ల రూపాయలను బీసీసీఐ ఆటగాళ్ళకు పంచింది. అదే 2013 - 14 సంవత్సరంలో కేవలం 11 కోట్ల రూపాయలను మాత్రమే ఇవ్వగలిగింది. ఏడాది ఏడాదికి పెరుగుతూ వెళ్ళాల్సిన ఆదాయం ఇలా ఒక్కసారిగా దఢేల్మని కింద పడిపోవడంతో బీసీసీఐ బుర్ర వాచి బొప్పి కట్టింది. బీసీసీఐ ఆదాయం తగ్గడంతో భారత క్రికెటర్లకు దక్కే సొమ్ము కూడా భారీగా తగ్గిపోయింది. ఇలా ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం ఇండియాలో క్రికెట్ మ్యాచ్‌లు చూసేవాళ్ళ సంఖ్య బాగా తగ్గడమే. క్రికెట్ చూసేవాళ్ళ సంఖ్య తగ్గడంతో టీవీల్లో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచ్‌ల గ్రాస్ రేటింగ్ పాయింట్స్ (జీఆర్పీ) కూడా భారీగా తగ్గిపోయింది. ఈ ఒక్క ఏడాదిలోనే 40 శాతం జీఆర్పీ పడిపోయింది. దాంతో టీవీల్లో ప్రసారమయ్యే మ్యాచ్‌లకు వచ్చే స్పాన్సరర్లు బాగా తగ్గిపోయారు. ఫలితం... బీసీసీఐ ఆదాయానికి భారీగా గండి పడింది. ఇలా టీవీల్లో మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ఇప్పుడు భారత జట్టులో లేకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త కుర్రాళ్ళు టీమ్‌లోకి వస్తూ వుండటం, వారిని అభిమానించేవారు ఎక్కువగా లేకపోవడమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసలు కారణాలు వేరే వున్నాయని పరిశీలకులు అంటున్నారు.
క్రికెట్ అనేది ఫూల్స్ గేమ్ అనేది నేటి యువతరంలో చాలామందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ ఫూల్స్ గేమ్ చూసే ఫూల్స్ జాబితాలో తాము కూడా వుండటం ఎందుకని చాలామంది క్రికెట్ మీద ఆసక్తికి గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతోపాటు చాలామంది యూత్ కెరీర్ ఓరియెంటెడ్ అయిపోయారు. ఎవరో ఆడితే, ఎవరో గెలిస్తే నాకేంటి... నా కెరీర్ సంగతి నేను చూసుకుంటాననే సీరియస్ ధోరణి కూడా ఇటీవలి కాలంలో పెరుగుతూ వుండటంతో క్రికెట్‌కి ఆదరణ తగ్గుతోంది. వీటితోపాటు క్రికెట్ రంగంలో పెరిగిపోయిన ఫిక్సింగ్ లాంటి అడ్డదారులు, బెట్టింగ్ లాంటి చెడ్డదారులు ఈ గేమ్ మీద వున్న క్రేజ్‌ని తగ్గిపోయేలా చేస్తున్నాయి. బెట్టింగ్స్ పుణ్యమా అని ఇప్పటికే దేశంలో ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సగటు లెక్కల ప్రకారం ఇండియాలో గతంలో క్రికెట్ ప్రియులు వారానికి 29 గంటలు క్రికెట్ చూసేవారు. 2014 సంవత్సరానికి అది 16 గంటలకు తగ్గిపోయింది. భవిష్యత్తులో అది మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. శుభం.