చెప్పాలనుకున్నదే లేఖలో రాశా..నిందితునికి రిమాండ్

 

విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.ఈ కేసులో నిందితున్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.జగన్‌పై దాడి కేసులో పురోగతిని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా సమీక్షిస్తున్నారు.నిందితుడు 9 సెల్‌ఫోన్లు మార్చినట్లు గుర్తించారు. మరో చిన్న కత్తిని కూడా శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కత్తి దాడి చేసిన శ్రీనివాసరావు ను ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ ప్రశ్నించారు.11 పేజీలు లేఖపై పూర్తి దర్యాప్తు సాగింది. లేఖలోని 9 పేజీలను నిందితుడి బంధువు విజయలక్ష్మీతో రాయించగా, ఒక పేజీని సహచర ఉద్యోగి శ్రీకాకుళం జిల్లా రంగులీపుట్టికి చెందిన రేవతిపతితో రాయించినట్టు దర్యాప్తులో తేలింది. రేవతిపతి గత నాలుగు నెలలుగా విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని, అతడు పదో తరగతి చదివాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి మూడు సెంటీమీటర్ల కత్తితో పాటు మరో చిన్న కత్తి స్వాధీనం చేసుకున్నారు.

దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాస్‌కు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదనపు జూనియర్‌ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించారు.కోర్టు నుంచి రిమాండ్ కు తీసుకెళ్తుండగా నిందితుడిని మీడియా ప్రతినిధులు ఘటనపై పలు ప్రశ్నలు అడిగారు. దీంతో తాను చెప్పాలనుకున్నదే లేఖలో రాశానని పేర్కొన్నాడు. అందులోనే చూసుకోండి.. అంటూ తెలిపాడు.మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఠాణేలంకలో శ్రీనివాస్‌ కుటుంబీకులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. శ్రీనివాస్‌ స్నేహితులు, బంధువులను సిట్‌ ఆరా తీసింది. నిందితుడు శ్రీనివాస్‌ సంక్రాంతికి కట్టిన ఫ్లెక్సీని సేకరించింది. లేఖ రాసిన శ్రీనివాస్‌ సోదరిని విచారణ నిమిత్తం పోలీసులు విశాఖకు తరలించారు.