ఈ కార్యదర్శి మాకొద్దు.. గవర్నర్ కోర్టుకు మండలి పంచాయతీ...

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి వ్యవహారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెంతకు చేరింది. తన రాజ్యాంగ అధికారాలను కార్యదర్శి ప్రశ్నిస్తున్నారని, కార్యదర్శిని  తప్పించాలని, కొత్త కార్యదర్శిని నియమించాలని మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ కు వినతిపత్రం అందించారు. 

అసెంబ్లీ కార్యదర్శి తన ఆదేశాలను ధిక్కరించడంపై  శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఆగ్రహంతో వున్న సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొంది.  రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను కార్యదర్శి పాటించడం లేదన్నారు. 

మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని.. తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి... మండలికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో అసెంబ్లీ కార్యదర్శి తీరుని గవర్నర్ కు వివరించారు.

రాష్ట్రచరిత్రలో మండలి కార్యదర్శిపై మండలి ఛైర్మన్ ఫిర్యాదుచేయడం ఇదే తొలిసారి అంటున్నారు. తన ఆదేశాలను పాటించడానికి రెండుసార్లు మండలి కార్యదర్శి నిరాకరించడంపై గవర్నర్ జోక్యం కోరారు. అసెంబ్లీ కార్యదర్శి నియామకంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉండడంతో షరీఫ్‌ నేరుగా ఆయన్నే కలిసి పరిస్థితిని నివేదించారు. అసెంబ్లీకి ప్రస్తుతం ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులు శాసనమండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సభలకు వేర్వేరుగా కార్యదర్శులు ఉండేవారు. మండలి కార్యదర్శి రిటైరైన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికే ఆ విధులు కూడా అప్పగించారు.

విజయరాజు గతంలో టీడీపీ హయాంలో అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేశారు. వైసీపీ ప్రభు త్వం వచ్చాక ఆయన్ను మార్చి బాలకృష్ణమాచార్యులను నియమించారు. మండలి సమావేశాల్లో రాజధాని బిల్లులు చర్చకు వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఛైర్మన్‌ నాలుగు పేజీల వినతిపత్రం గవర్నర్‌కు అందజేశారు. తాను కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రతులు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నోట్‌ ఫైల్‌ను కూడా ఇచ్చారు. 

చట్టసభల నిర్వహణలో రాజ్యాంగ సంప్రదాయాలకు సంబంధించి ప్రమాణంగా పాటించే కౌల్‌ అండ్‌ షక్దర్‌ పుస్తకంలో తన అధికారాల గురించి ఇచ్చిన వివరణను కూడా చైర్మన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ తానిచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ మండలిలో సభా నాయకుడిగా ఉన్న రెవెన్యూ మంత్రి పంపిన లేఖ.. చైర్మన్‌ అధికారాలను ధిక్కరించడమేనన్నారు. 

శాసనమండలిలో జరిగిన పరిణామాలను షరీఫ్ గవర్నర్ కు వివరించారు. సభకు వచ్చిన రాజధాని బిల్లులు సభామోదం పొందలేదని, సభలో ఏకాభిప్రాయం సాధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తనకు సంక్రమించిన అధికారాల కింద ఆ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించానని చైర్మన్‌ పేర్కొన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడారు.

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో కార్యదర్శి తీరును గవర్నర్‌కు వివరించానన్నారు. చైర్మన్‌ ఆదేశాలను కాదన్న సందర్భం గతంలో లేదని, నిబంధనలకనుగుణంగానే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. నా రూలింగ్‌ను కార్యదర్శి అమలు చేయడం లేదన్న విషయం ఆయనకు చెప్పి తగు చర్యలు తీసుకోవాలని కోరానన్నారు.  ఈ వ్యవహారంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు శాసన మండలిలో అనూహ్యంగా వీగి పోయాయి. అందుకు మండలిలో తెలుగుదేశం తెరపైకి తెచ్చిన రూల్స్ అధికారపక్షం ఊహించను కూడా లేదు. సభా వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు వంటి వ్యక్తుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో, ఏంజరగబోతోందో ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.