కడప జిల్లాలో 55కు చేరిన కేసులు

* గుంటూరు జిల్లాలో ఎనిమిది మంది డిశ్చార్జ్ 

కడప జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన నాలుగు కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకుంది. ఇవాళ్టి నాలుగు కేసుల్లో ప్రొద్దుటూరులో మూడు, ఎర్రగుంట్లలో ఒక కేసు నమోదైంది. కాగా ఇవాళ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 4,820 శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదీ : రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 61 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1016. ఇప్పటి వరకూ 171 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 814 అని వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో తెలిపింది.

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  వ్యక్తులకు  నిర్వహించిన పరీక్షలో  రెండు సార్లు  నెగిటివ్ రావడంతో ఆరుగురిని శనివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.  వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారు 3, మంగళగిరికి చెందిన ఒకరిని,  వేజండ్లకు చెందిన ఒకరిని, అచ్చంపేటకు చెందిన  ఒకరిని  ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.