కాంగ్రెస్ పార్టీకి చావు లేదు: శ్రీనివాస్

 

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చావు లేదని, దానిని ఎవరూ ఎన్నటికీ పూర్తిగా తుడిచిపెట్టేయలేరని అన్నారు. తెలంగాణా భావోద్వేగాల కారణంగానే తెరాస అధికారంలోకి వచ్చింది తప్ప లేకుంటే తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే తెలంగాణాలో తప్పకుండా అధికారంలోకి వచ్చి ఉండేదని అన్నారు. ఇప్పడు కాకపోయినా ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు ఉన్నాయి ఆయన మాటలు. అయితే కాంగ్రెస్ పార్టీకి చావు లేదనే మాట మాత్రం నూటికి నూరుశాతం నిజమని అంగీకరించవలసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు దశాబ్దాలలో ఇటువంటి ఘోర పరాభవాలు చాలానే చూసింది. కానీ సజీవంగానే ఉంటూ మళ్ళీ ఎప్పుడో అప్పుడు అధికారం హస్తగతం చేసుకోగలుగుతోంది. అందుకు మంచి ఉదాహరణగా కర్నాటక రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చును. దాదాపు రెండు దశాబ్దాలుగా కర్నాటకలో కాలు మోపలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, గతేడాది జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రాగలిగింది.

 

అందువల్ల తెలంగాణాలో కూడా శ్రీనివాస్ చెప్పినట్లు ఐదేళ్ళ తరువాత కాకపోయినా మరో పదో పదిహేనేళ్ళ తరువాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. కేంద్రంలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది కనుక రాహుల్ గాంధీకి ఇక జీవితంలో ఎన్నడూ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కకపోవచ్చును. ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తే దానికి మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు పట్టం కట్టవచ్చును. లేకుంటే అందుకోసం జగన్మోహన్ రెడ్డి కాసుకొని కూర్చొని ఉన్నారు కనుక అక్కడా మరో పదేళ్ళ వరకు అవకాశం దక్కకపోవచ్చును. కానీ శ్రీనివాస్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి చావు లేదని అర్ధమవుతోంది కనుక అది ఎన్ని దశాబ్దాలయినా అది అధికారం కోసం ఎదురుచూడగలదని అందరూ అంగీకరించక తప్పదు.