ఓ మూడు-నాలుగు లక్షల కోట్లు ఇవ్వండి!

 

ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం దాదాపు 1.2 లక్షల కోట్లు అవసరం ఉంటుందని ప్రాధమికంగా ఒక అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమే ఆ భారం మొత్తం భరించాలని కోరుతోంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆ మొత్తాన్ని 3 నుండి 4 లక్షల కోట్లకు పెంచుతూ కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు, అందుకు గల కారణాలతో కూడిన ఒక నివేదిక సిద్దం చేస్తోంది.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మరియు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ శుక్రవారం తిరుపతి సందర్శించేందుకు వస్తున్న ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ వేణుగోపాల రెడ్డిని కలిసి, వచ్చే సం.ఏప్రిల్ నుండి మొదలయ్యే 14వ ఫైనాన్స్ కమీషన్ సం.లో ఈ ప్రతిపాదనలను మంజూరు చేయవలసిందిగా కోరబోతున్నారు.

 

ఇంతకాలం కేవలం రాజధాని నిర్మాణం కోసం అయ్యే వ్యయం గురించి మాత్రామే మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇకపై రాష్ట్ర విభజన కారణంగా ప్రధాన ఆర్ధిక వనరుగా నిలుస్తున్న హైదరాబాదును కోల్పోవడం వల్ల ఏర్పడిన ఆర్ధిక లోటు, విభజన కారణంగా రాష్ట్రానికి ఏర్పడిన ఇతర సమస్యలు, నష్టాలు వాటిని పూడ్చుకోనేందుకు అవసరమయిన సొమ్ము గురించి కూడా తన తాజా నివేదికలో చేర్చబోతోంది. ఇవే కారణాలతో ఇంతవరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వస్తున్న 32శాతం సెంట్రల్ టాక్సులను, ఇకపై 50శాతానికి పెంచవలసిందిగా కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదివరకు యూపీయే ప్రభుత్వం కూడా రాష్ట్రానికి 40శాతం వాటా చెల్లించమని 14వ ఫైనాన్స్ కమీషన్ న్ను కోరిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేసి తమ అభ్యర్ధనను మన్నించమని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

రాజధాని, దానితో బాటు హైదరాబాదులో ఉన్నట్టి అన్ని ఉన్నత విద్యా, వైద్య, ప్రభుత్వ రంగ సంస్థలను ఆంద్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం 3 నుండి 4 లక్షల కోట్లు అవసరం ఉంటుంది గనుక కేంద్రం ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకొంటోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరూ కూడా రాష్ట్ర విభజనకు అంగీకరించకపోయినప్పటికీ, గత యూపీయే ప్రభుత్వమే తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా బలవంతంగా రాష్ట్ర విభజన చేసింది గనుక, కేంద్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం పూర్తి బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరబోతోంది.

 

అయితే రాష్ట్ర ప్రభుత్వంలాగే కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసేపరిస్థితిలో ఉందా లేదా? ఉన్నా అంత భారీ మొత్తం మంజూరు చేస్తే ఇతర రాష్ట్రాల నుండి కూడా అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది గనుక అంత భారీగా నిధులు మంజూరు చేస్తుందా లేదా?వంటి అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఏమయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నలోపం లేకుండా కృషి చేయడం మంచి విషయమే.