కాంగ్రెస్ ఘన చరిత్రలో సీబీఐ అధ్యాయం

 

125 సం.ల చరిత్ర కలిగిన పార్టీ మాదని కాంగ్రెస్ నేతలు అందరూ గర్వపడటం మనం నిత్యం చూసేదే. అయితే, అంత ముసలిదయిపోయింది గనుకనే అంత ముసలి ఆలోచనలు చేస్తోందని విమర్శించేవారు లేకపోలేదు.

 

తనకు మద్దతు ఇచ్చినంత కాలం సదరు పార్టీలను ఖాతరు చేయక ఒంటెత్తు పోకడలు పోవడం, వారు మద్దతు ఉపసంహరిస్తే వారిని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్, ఆదాయపన్ను శాఖా వంటి సంస్థల చేత కేసులు పెట్టించి ముప్పతిప్పలు పెట్టడం వంటి దుర్లక్షణాలు అన్నీకలిగి ఉన్నకాంగ్రెస్ పార్టీ, తన ఘన చరిత్రలో ఇప్పుడు కొత్తగా సీబీఐ అనే ఒక అద్యాయాన్ని కూడా జోడించుకొంది. తవ్విన కొద్ది గుట్టలు గుట్టలు బయటపడే అటువంటి అంశాలన్నిటినీ పేర్కొనాలంటే ప్రత్యేకంగా మరో చరిత్ర అవుతుంది.

 

మన రాష్ట్రానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డితో సీబీఐ ఆడుకొంటున్నతీరు అందుకు ఒక మంచి నిదర్శనం కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి తలాక్ చెప్పి బయటకొచ్చిన ఓవైసీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గుణ పాఠం చెప్పిందో అందరికీ తెలుసు.

 

మాజీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి తన పదవిలో మళ్ళీ పునర్నియామకం అవుతున్న నిమిషంలో ఆదాయపు పన్నుశాఖ వారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వేసిన పాచికకు ఆయన ఓడిపోయాడు. కానీ ఆ తరువాత ఆదాయపన్ను శాఖ కూడా మరి ఆయనను పట్టించుకొన్న దాఖలాలు లేవు. ఎందుకంటే, దాని లక్ష్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శిస్తున్న నితిన్ గడ్కారి (కూడా) ఒక అవినీతి పరుడని నిరూపించడం మాత్రమే. కానీ, తొందరపడి కూసిన కోయిలలా కాంగ్రెస్ ముందే విసిరిన ఆ పాచిక వలన బీజేపీకి నష్టం జరుగకపోగా మేలే జరిగింది. ఒక అవినీతి పరుడయిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేసుకొని ఎన్నికల సమరాంగణంలో దూకడం ఆ పార్టీకే నష్టం కలిగించేది. కానీ, కాంగ్రెస్ చేసిన మేలు వలన అది ఆయన స్థానంలో మచ్చలేని రాజ్ నాథ్ సింగును ఎన్నుకోగలిగింది.

 

ఒకవైపు ములాయం సింగు( సమాజ్ వాది) మరో వైపు మాయావతి (బహుజన్ సమాజ్ వాది) ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ తమని సీబీఐ చేత బెదిరిస్తూ మద్దతు పొందుతోందనే రహస్యం మీడియావారి చెవుల్లో చాలా కాలంగానే వేస్తున్నారు, కానీ ఈ రోజుల్లో చేయి మెలిక పెట్టకుండా అటువంటి వారిని లొంగదీయలేమని కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయం.

 

ఇక ములాయం సింగు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు డబ్బు తీసుకొంటున్నాడని, గౌరవనీయులయిన కేంద్ర మంత్రి వర్యులు బీణా వర్మగారు ఒక చక్కటి బహిరంగ రహస్యం పార్లమెంటులో చెప్పినపుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ, అటువంటి దేవరహస్యాలు ఇలాగ బహిరంగంగా ఎవరయినా చెప్పుకొంటారా అని ఊగిపోయారు.

 

ఇక తమిళ తంబి కరుణలేని కరుణానిధి యుపీయే ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించి ఇంటికి చేరుకొనే లోగానే సీబీఐ వారు ఆయనకీ గుమ్మంలోనే ఎదురయ్యారు. ఆయన కొడుకు స్టాలిన్ విదేశాల నుండి తెచ్చుకొన్న విలసవంతమయిన కార్లకి పన్ను కట్టలేదంటూ ఈ రోజు ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. కానీ, చెన్నై చిదంబరం కన్నెర్ర చేయడంతో సీబీఐ వారు తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. సీబీఐ వారు చెపుతున్న కుంటిసాకుల సంగతి ఎలా ఉన్నా, వారు సోదాలు నిర్వహించిన సమయం, సందర్భం చూస్తే, వారి వెనుక కాంగ్రెస్ ఉందని అర్ధం అవుతుంది. కాంగ్రెస్ చరిత్రలో ఇటువంటి అధ్యాయాలు మరిన్ని మనం చూడాలో తెలియదు.