ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ధర్నా..హవ్వ!
posted on May 2, 2015 7:57AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని, మనోభావాలను లెక్క చేయకుండా రాష్ట్రాన్ని విభజించినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పారు. కొందరు తెలివయిన కాంగ్రెస్ నేతలు మునిగిపోతున్న తమ కాంగ్రెస్ నావలో నుంచి ఎన్నికలకు ముందే బయటకు దూకేసి తమ రాజకీయ భవిష్యత్ కాపాడుకోగా మరి కొందరు ఎన్నికల తరువాత ‘బ్రతుకే జీవుడా’ అనుకొంటూ ఇతర పార్టీలలోకి వలస వెళ్ళిపోతున్నారు. వివిద కారణాల వల్ల ఏ పార్టీలోకి వెళ్ళలేకపోయిన వారు మాత్రం వీర విదేయుల్లా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వారిలో ఆనం రామినారాయన రెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, శైలజానాద్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి వంటి, పల్లం రాజు వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు ప్రజలకు కనబడి చాలా కాలమే అయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకవెలుగు వెలిగి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన చిరంజీవి తన 150వ సినిమా నిర్మాణంపై దృష్టి లగ్నం చేయగా, బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరేందుకు మూట ముల్లె సర్దుకొని ఎదుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పి.సి.సి.అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కరే కాస్త హడావుడి చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.
బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం అంటూ ఇదివరకు కోటి సంతకాల కార్యక్రమం, మళ్ళీ ఈరోజు గుంటూరులో ధర్నా చేయబోతున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు రఘువీరారెడ్డి, చిరంజీవి, కేవీపీ రామచంద్ర రావు, పనబాక తదితరులు హాజరవుతారని సమాచారం. ఒకవేళ దీనికి బొత్స సత్యనారాయణ హాజరు కానట్లయితే ఆయన వైకాపాలో చేరడం ఖాయమని భావించవచ్చును.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేస్తూ, ఎలాగూ తమ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఓడిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనే సంగతి పసిగట్టి సాధ్యాసాధ్యాలు గమనించకుండానే చివరి ప్రయత్నంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు హడావుడిగా పార్లమెంటులో ప్రకటించి చేతులు దులుపుకొంది. ఊహించినట్లే ఆ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే చిత్తశుద్ధి నిజంగా ఉండి ఉంటే ఆ అంశాన్ని కూడా విభజన బిల్లులో చేర్చి ఉండేది. కానీ చేర్చలేదంటే దాని చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుంది. మరి ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ హడావుడిని ఎవరు నమ్ముతారు?
కాంగ్రెస్ పార్టీ పోతూపోతూ ప్రత్యేక హోదా ఉచ్చును బీజేపీ మెడకు చుట్టి పోయింది. కనుక ఇప్పుడు దానిని బిగిస్తూ మోడీ ప్రభుత్వాన్ని, దానితో కలిసి పనిచేస్తున్న తెదేపా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకే దెబ్బకు నాలుగు పిట్టలన్నట్లుగా ఈ ప్రత్యేక హోదా అంశంపై పోరాడితే అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టవచ్చు. రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవచ్చు. ప్రజలను మళ్ళీ మభ్యపెట్టవచ్చు. అగమ్యగోచరంగా ఉన్న పార్టీ పరిస్థితి చూసి డీలా పడిపోయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీలలోకి జంప్ అయిపోకుండా కాపాడుకోవచ్చుననే ‘మల్టీ పర్పస్-యాక్షన్ ప్లాన్’ తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అంటూ హడావుడి చేస్తోంది. కానీ ఎంత హడావుడి చేసినా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మనంతవరకు దాని పరిస్థితిలో మార్పేమీ రాబోదనే సంగతి గ్రహించాలి.
తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ప్రజాభిప్రాయాన్ని, వారి మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతోందంటే ఎవరు నమ్మబోరు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని, రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు ఈ మాత్రం కష్టపడక తప్పదు. అందుకే వారు ఈవిధంగా ఆపసోపాలు పడుతున్నారని సరిపెట్టుకోవలసి ఉంటుంది.