భూసేకరణతో రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు

 

రాజధాని నిర్మాణం కోసం, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ఉన్నత విద్యావైద్య సంస్థల నిర్మాణం కోసం తెదేపా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తోంది. అవి ప్రభుత్వ భూములో లేక నిరుపయోగమయిన భూములో అయితే ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. కానీ అవి చాలా విలువయిన పంట భూములు కావడంతో సహజంగానే రైతులు, కొందరు ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని కోసం తుళ్ళూరు మండలంలో సుమారు 30,000 ఎకరాలు, విమానాశ్రయం కోసం గన్నవరం వద్ద సుమారు 500 ఎకరాలు, వైజాగ్-శ్రీకాకుళం మధ్యలో ఉన్న భోగాపురం వద్ద విమానాశ్రయం, విమానాల రిపేరింగ్ మరియు విమాన శిక్షణ సంస్థల ఏర్పాటు చేసేందుకు 15, 000 ఎకరాల పంట భూములను ప్రభుత్వం సేకరిస్తోంది. అయితే వీటిల్లో ఎక్కడా కూడా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోవడం లేదు. కనుక సహజంగానే రైతులలో ఈ భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

రాజధాని కోసం భూములిస్తామని ప్రభుత్వానికి అంగీకార పత్రాలిచ్చిన 500మంది రైతులు హైకోర్టుని ఆశ్రయించి ఉపశమనం పొందారు. వారి భూములలో వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం కల్పించవద్దని హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నేడోరేపో రాజధాని మాష్టర్ ప్లాన్ చేతికి అందగానే భూమిపూజ చేసి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడదామని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది నిజంగా అగ్నిపరీక్ష వంటిదే.

 

ఒకవేళ రైతులు ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా రాజధాని కోసం భూములిచ్చేందుకు అంగీకరించకపోతే భూసేకరణ చట్టం ప్రయోగించయినా భూసేకరణ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పడంతో రైతులలో, కలకలం మొదలయింది. ప్రతిపక్షాలకు ఆయన ప్రకటన గొప్ప ఆయుధాన్ని అందించినట్లయింది. చివరికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి పార్ట్ టైం రాజకీయనాయకులు సైతం రైతుల తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమని ప్రకటిస్తున్నారంటే అందుకు వారిని నిందించి ప్రయోజనం లేదు. రాజధాని నిర్మాణం కోసం తుళ్ళూరు మండలాన్ని ఎంచుకోకమునుపే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పర్యవసానాలను ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అన్నీ తెలిసి ముందుకు వెళ్ళింది అంటే అందుకు సిద్దపడే అడుగు ముందుకు వేసిందని భావించాల్సి ఉంటుంది. కనుక ప్రస్తుత పరిణామాలను ఎదుర్కొని, వాటి చేదు పర్యవసానాలను స్వీకరించక తప్పదు.

 

మొదట చాలా మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వారితో మాట్లాడిన తరువాత తిరిగి వారిలో చాలామంది భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చేరు. కానీ వైకాపా నేతల ప్రోద్భలంతో మళ్ళీ కొందరు రైతులు హైకోర్టుని ఆశ్రయించి, తమ భూములలో వ్యవసాయం చేసుకొనేందుకు అనుమతి పొందడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకవేళ మంత్రి పుల్లారావు చెపుతున్నట్లు ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగిస్తే దాని వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అలాగని భూసేకరణ చేయకపోయినట్లయితే రాజధాని నిర్మాణం చేయడం అసాధ్యం. రైతుల మనోభావాలతో ముడిపడున్న సున్నితమయిన ఈ సమస్యను ప్రభుత్వం ఏవిధంగా అధిగమిస్తుందో తెలియదు కానీ ఏవిధంగా చూసినా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చును.

 

రాజధాని కాకుండా రాష్ట్రంలో ఇంకా పోలవరం, పట్టిసీమ, మెట్రో రైల్ ప్రాజెక్టులు, గిరిజన, పెట్రో విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.యం, ఐఐటి, ఐఐఐటి, ఎయిమ్స్, వంటి ఉన్నత విద్యా వైద్యసంస్థలు, అనేక పరిశ్రమలు, ఐటి సంస్థలు, విమానాశ్రయాలు వగైరాలన్నీ రానున్న నాలుగేళ్లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇవి కాక వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా విభజన బిల్లులో హామీలే ఇవ్వన్నీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించి ఆ హామీలనన్నిటినీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలుచేయాలని కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ నిరసన దీక్షలు, ధర్నాలు చేయడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం వాటిని అమలుచేయడానికి పూనుకోగానే మళ్ళీ వారే భూసేకరణకు అడ్డుపడుతూ రైతుల తరపున పోరాడుతున్నట్లు నటిస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతూ ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

తుళ్ళూరులో రాజధాని నిర్మాణం చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చెపుతున్న వైకాపా నేతలు రైతులను రెచ్చగొట్టి కోర్టులకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారని అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు విమర్శిస్తున్నారు. పోనీ వైకాపా నేతలు రైతుల తరపున నిలబడి నిజాయితీగా పోరాడుతారా...అంటే అదీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం రైతుల భూములు తీసుకొన్నప్పటికీ,  తను ముఖ్యమంత్రి అయిన తరువాత ఎవరి భూములు వారికిచ్చేస్తానని రైతులతో వెటకారమాడటం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. రైతుల కోసం నిరాహార దీక్షలు, న్యాయ పోరాటాలు చేస్తానని హామీలు గుప్పించిన మెగా బ్రదర్స్ ఇరువురూ తమ సినిమా నిర్మాణ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. మధ్యలో తీరిక దొరికినప్పుడు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోతుంటారు.

 

ఈవిధంగా సున్నితమయిన సమస్యలను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించి వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయకుండా ఆ సమస్యలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూడటం చాలా దారుణం. ఈ ఐదేళ్ళలో రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రప్రభుత్వం పదేపదే చెపుతోంది. చెప్పడమే కాకుండా దానిని ఆచరించి చూపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెదేపా కూడా వీలయినంత త్వరగా రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను మెప్పించి వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. దాని ఉద్దేశ్యాలు ఎవయినప్పటికీ ఈ నాలుదేల్లలో రాష్ట్రాభివృద్ధి చేయాలనే దాని చిత్తశుద్ధిని శంఖించనవసరం లేదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవలసిన ఈ సమయంలో రాజకీయ పార్టీలు అడుగడుగునా రాష్ట్రాభివృద్ధికి ఆడుతగిలినట్లయితే వారికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారు.