ఉనికి కోసం ప్రజా సమస్యల పేరిట ప్రతిపక్షాల పోరాటాలు
posted on Dec 1, 2014 8:40AM
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటూనే రాష్ట్రాన్ని పునాదుల నుండి నిర్మించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇంతకాలం దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఇప్పుడు రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏర్పడింది. అందుకు ఆంధ్రప్రజలు ఎంతగా బాధపడుతున్నారో తెలుసు. రాష్ట్రం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అత్యవసరంగా రాజధాని నిర్మాణం చేయవలసి రావడం మరో పెద్ద సవాలు. ఇవి కాక హుద్ హూద్ వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాలలో ఉన్నతెలుగు ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలబడి ఉడతా భక్తిగా తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సినీ పరిశ్రమ కూడా ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చింది. సింగపూర్, జపాన్ వంటి దేశాలు సైతం రాజధాని నిర్మాణానికి, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీలయినా కాంగ్రెస్ , వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, అది తలపెట్టిన ప్రతీ పనికి అడ్డం పడుతుండటం చాలా దురదృష్టకరం. రాజధాని భూముల సమీకరణ మొదలు హుద్ హుద్ తుఫాను వరకు దేనిని విడిచిపెట్టకుండా ప్రతీ అంశం నుండి రాజకీయ మైలేజీ పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
తమిళనాడులో ప్రధాన పార్టీలయిన డీఎంకే, అధికార అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎంత రాజకీయ విభేదాలున్నప్పటికీ, నిత్యం ఒకరిపై మరొకటి ఎంతగా కత్తులు దూసుకొంటునప్పటికీ, శ్రీలంక జాలర్ల సమస్య, శ్రీ లంక తమిళుల సమస్య, హిందీ బాష వంటి అనేక అంశాలలో ఆ రెంటితో సహా రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, వై. కాంగ్రెస్ పార్టీలు మాత్రం ప్రభుత్వానికి ప్రతీ పనిలో అడ్డంకులు కల్పించడమే కాదు, రాష్ట్రంలో పొరుగు రాష్ట్రపు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో యుద్దాలు చేస్తుంటాయి.
సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని, రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కేవలం తమ ఉనికిని కాపాడుకొనేందుకు అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తుండటం చాలా విచారకరం. కానీ తమ ఉనికిని కాపాడుకొనేందుకు ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే అవి ప్రజాగ్రహానికి గురయ్యి తమ ఉనికిని కోల్పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.
రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని చెప్పుకొనే ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నప్పటికీ, ఇటువంటి సవాళ్ళను, సంక్షోభాలను ధీటుగా ఎదుర్కొని వాటి నుండి అవకాశాలను సృష్టించుకొనే సత్తా తనకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విశేషం. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినప్పటికీ, తను చేస్తున్న ప్రయత్నాల కారణంగా దేశవిదేశాలు సహాయం చేసేందుకు ముందుకు వస్తుండటమే అందుకు మంచి ఉదాహరణ అని ఆయన నిన్న మేము సైతం కార్యక్రమంలో ప్రసంగిస్తున్నప్పుడు చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం మేము మాత్రం మారబోమని తేల్చి చెపుతున్నాయి. హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు తరలివచ్చి వారం రోజులపాటు స్వయంగా తుఫాను సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించి, విశాఖ ప్రజల మన్ననలు అందుకొంటుంటే, హూద్ హూద్ తుఫాను కోసం కేంద్రం ఇచ్చిన నాలుగు వందల కోట్ల రూపాయలను ఆయన జేబులో పడేసుకొన్నారని వైకాపా ఆరోపించడం చాలా దారుణం. కేంద్రప్రభుత్వం ఇచ్చిన డబ్బుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లెక్క అప్పజెప్పనవసరం లేదని వైకాపా ఏవిధంగా అనుకొంటోందో దానికే తెలియాలి.
ఇటువంటి ఆరోపణలు, స్వీయ మనుగడ కోసం ప్రజా సమస్యల పేరిట అభివృద్ధికి అవరోధాలు కల్పించడం వలన ప్రజలలో అవి మరింత చులకన అవడం తప్ప ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరదని గ్రహిస్తే మేలు. లేకుంటే మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో వాటికీ అటువంటి గుణపాటమే నేర్పడం తధ్యం.