డిఎస్ వల్ల ఒరిగేదమన్నా ఉందా

 

పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని విడదీసి పాపం కట్టుకున్న ఒక్క కారణంగా దానికి శిక్ష అనుభవిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి అసలు లేదు.. అసలు అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియదు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఉంది అంతే. అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అది కూడా గుర్తొస్తుంది. అందుకే పార్టీలోని నాయకులు చిన్నచిన్నగా పార్టీ మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది పార్టీ ఫిరాయించారు. ఆ జంపింగ్ లిస్టులో కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కూడా చేరిపోయాడు.

ఇప్పుడు డిఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబి రంగు పూసుకోనున్నారు. కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించిన పీసీసీ బొత్స సత్యనారాయణ ఈ మధ్యనే వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. వాళ్లు మారారు నేను మారలేనా అని అనుకున్నారేమో డిఎస్ కూడా పార్టీ ఫిరాయించేశారు. పైగా తాను పదవులు కోసం కాదు పార్టీ మారింది.. బంగారు తెలంగాణ కోసం అని..మాటలు చెప్పడం. అంటే సంవత్సరం నుండి గుర్తుకురాని బంగారు తెలంగాణ ఇప్పుడు ఇంత సడెన్ గా ఎందుకు గుర్తొచ్చిందో డిఎస్ కి అని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. పైగా ఇంకా గులాబీ నీళ్లు తాగకముందే అప్పుడే కేసీఆర్ ను పొగడటం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అప్పుడే భజన చేసేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ తనకు అన్ని రకాలుగా తోడుండి 9 సార్లు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినా 3 సార్లు మాత్రమే గెలిచారు డిఎస్. కాంగ్రెస్ పార్టీ అంత సపోర్టు ఇచ్చినా నెగ్గుకురాలేని డిఎస్ ఇప్పుడు పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరడం వల్ల టీఆర్ఎస్ కు ఎమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమో అది కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఇప్పటివరకైతే ఎలాంటి ఢోకా లేదు.. ఇప్పుడు డిఎస్ చేరడం వల్ల ఆపార్టీకి కొత్తగా ఒరిగేది కూడా ఏంలేదు. ఏదేమైనా పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన డీఎస్ కేవలం ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే పార్టీ మారడం ఎంత మాత్రం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.