కేసీఆర్ ని కలిసిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!!

 

సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఆదివాసీ ఎమ్మెల్యేలు కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య లున్నారు. తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఆదివాసుల సమస్యలతో పాటు.. మొత్తం రాష్ట్రవాప్తంగా వున్న ఆదివాసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆదివాసి ప్రాంతాల్లోని పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరారు. అందుకు సంబంధించి వినతి పత్రాన్ని అందచేశారు.

ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యేలకు సీఎం హామీ ఇచ్చారు. అతి త్వరలో ఆదివాసులు ఎక్కువగా వున్న నియోజకవర్గాలను స్వయంగా తానే సందర్శించి.. పోడు భూముల సమస్యతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించనునున్నట్లు సీఎం తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తానని.. అందుకు అనుగుణంగా ఆదివాసి ప్రజల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.