కేటీఆర్ మాటలకు అర్దాలే వేరులే..

 

ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అన్నాడు ఓ కవి. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్దాలు వేరులే అనేలా ఉన్నాయి తాజగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యల్లో అర్ధం,పరమార్థం,యదార్థం.. అర్ధంగాక  తలలు పట్టుకుంటున్నారు టీడీపీ నేతలు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ అసెంబ్లీ ప్రాంగణంలో పాత్రికేయులతో కాసేపు ముచ్చటించారు. నిన్న సభ వాయిదా పడిన అనంతరం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయం వద్ద ఆయనను కలిసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను ఆత్మీయంగా పలకరించారు. ఓ జర్నలిస్టు పసుపు పచ్చ రంగు వేసుకుని ఉండటాన్ని చూసిన కేటీఆర్‌ ‘పచ్చరంగు చొక్కానా..? ఆ రంగు లేకుండా చేద్దామనుకుంటుంటే ఆ రంగు చొక్కానే వేసుకొచ్చావా?’అని సరదాగా అన్నారు. దీనికి ప్రతిస్పందించిన ఆ జర్నలిస్టు పచ్చరంగు ప్రకృతిలో భాగమే కదా అన్నారు. ఆ మాట సరిగా వినబడకపోవడంతో మళ్లీ అడిగి తెలుసుకున్న కేటీఆర్‌ ప్రకృతేనా...వికృతి కాదు కదా..! అంటూ నవ్వుతూ బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కేటీఆర్ సరదాగా అన్నాడో ? సీరియస్ గా అన్నాడో ? అర్ధం కానీ పరిస్థితి. పచ్చ రంగు లేకుండా చేద్దామనుకున్నారంటే దాని పరమార్ధం తెలంగాణలో టీడీపీని లేకుండా చేద్దామనుకోవటమే. ఎప్పటినుంచో టీఆర్ఎస్ అదే పనిలో ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేల్ని చాలావరకు తమ పార్టీలోకి లాగేసుకున్నారు కేసీఆర్. అప్పట్లో టీడీపీ తరుపున మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యేనే. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలు గెలుచుకోగా.. వాళ్ళని కూడా టీఆర్ఎస్ లో చేర్చుకొని టీడీపీ ప్రాతినిధ్యం అనేదే లేకుండా చేయాలని అనుకుంటున్నారు. మొన్నటి వరకు వాళ్ళని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించటం,వాళ్ళు చేరాలనుకోవటం ప్రచారం మాత్రమే అనుకున్నాం. అందులో యదార్థం ఎవరికీ తెలియదు. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఇదంతా నిజమే అనే భావన కలగటం ఖాయం.