పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం
posted on May 11, 2024 5:28PM
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు , ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం కాసేపట్లో ముగియనుంది. ఎ.పి.లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఆ పార్టీ ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌కి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఇతర రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా పవన్‌ని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ పిఠాపురం వెళ్ళారు. రాజమండ్రి విమానాశ్రయం వద్ద మెగా అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. చరణ్‌కు ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ఎయిర్ పోర్టు ఎగ్జిట్ గేట్ వద్ద సందడి నెలకొంది. చరణ్‌తో పాటు ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అక్కడి నుంచి చరణ్ పిఠాపురంకు బయల్దేరారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వరస్వామి వారిని చరణ్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పిఠాపురం పట్టణంలో ఆయన పర్యటిస్తారు.