కాంగ్రెస్ పై డిఎంకె ఆగ్రహం
posted on Apr 25, 2011 12:27PM
న్యూఢిల్లీ: 2జి
స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు మరోసారి కాంగ్రెసు, డిఎంకెల మధ్య సంబంధాలను దెబ్బ తీసే పరిస్థితిని కల్పించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి పేరును సిబిఐ 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసు చార్జిషీట్‌లో చేర్చించింది. కరుణానిధి ఇద్దరు భార్యల్లో ఒక భార్య దయాళ్ అమ్మాళ్ పేరును కూడా సిబిఐ తన చార్జీషీట్‌లో చేర్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, చార్జీషిట్‌లో కనిమొళి పేరును చేరుస్తూ సిబిఐ సోమవారం రెండు చార్జీషీట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీకి సమర్పించింది. దయాళ్ అమ్మాళ్ పేరును చార్జిషీట్‌లో చేరిస్తే మంత్రి వర్గం నుంచి తప్పుకోవాలని తమ ఆరుగురు కేంద్ర మంత్రులను కరుణానిధి ఆదేశించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. చార్జిషీట్‌లో తన తల్లి పేరు చేర్చే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలతో ఆమె కుమారుడు అళగిరి అసంతృప్తితో ఉన్నారుట. నిందితుల జాబితాలో తన తల్లి పేరు చేరిస్తే తాను ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలని ఆయన అడిగారు. ఈ స్థితి వల్ల దయాళ్ అమ్మాళ్ పేరును చార్జిషీట్‌లో చేర్చకూడదని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మే 13వ తేదీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు నిరీక్షించాలని డిఎంకె నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.