సీఎం జగన్ పై పోటీ చేసి గెలుస్తా.. మీకు దమ్ముందా.. రఘురామరాజు సంచలన కామెంట్స్ 

వైసీపీకి కంట్లో నలుసుగా తయారైన రెబల్ ఎంపీ రఘురామరాజు మరోసారి సొంత పార్టీ పై అలాగే సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసారు. తాజాగా సీఎం జగన్ కు నేరుగా సవాల్ విసురుతూ.. "అమరావతి రాజధాని అంటూ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే సీఎం వైఎస్ జగన్‌ పైనే 2 లక్షల మెజార్టీతో నేను గెలుస్తాను. దమ్ముంటే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలి. ఇది నేను అతిశయోక్తితో చెబుతున్నది కాదు. త్వరలో నాపై అనర్హత వేటు వేయిస్తామని తమ మీడియాలో పిచ్చి రాతలు రాయిస్తున్నారు. ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. పదవి నుంచి తొలగించడమంటే అది పూర్తిగా వేరుగా ఉంటుంది. దాని సంగతి ప్రజలే చూస్తారు. అయినా నన్ను ఎవరూ తొలగించలేరు. దీనిపై వారికి (వైసీపీ పెద్దలకు) సవాల్ విసురుతున్నాను" అని రఘురాజు అన్నారు .

 

ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న రఘురాజును తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై తాజాగా స్పందించిన అయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ.. తనను ఎవరూ తొలగించలేదని.. తొలగించలేరు కూడా అంటూ వ్యాఖ్యానించారు. దీని పై మరింత వివరణ ఇస్తూ.. "మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి నన్ను తొలగించాలని వైసీపీ ఎంపీలు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. అది ఒక ఏడాది పదవి అని.. అయితే మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారు. తాజాగా నా పదవి కాలం అయిపోయింది కాబట్టి.. దానిని మా పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని వైసిపి లెటర్ ఇచ్చింది. ఇప్పటివరకు రెడ్డి సామజిక వర్గానికి పదవులు ఇవ్వడం అయిపోయింది దీంతో. ఆయన మతానికి చెందిన వారికి ఆ పదవి ఇచ్చారు. బాలశౌరికి ఆ పదవి ముష్టి వేసారు. ఈ విషయం తెలియని వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటోంది" అని ఎంపీ రఘురాజు అన్నారు.