కంప్లయింట్ తీసుకోవాలంటే..షూ పాలిష్ చెయ్..!

తమకొచ్చిన కష్టం తీర్చమంటూ పోలీస్ ‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు మనలో చాలా మంది. అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్ సిగ్గుపడేలా ఉత్తరప్రదే‌శ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసులు వ్యవహరించారు. ముజఫర్‌నగర్ సమీపంలోని హైబత్పూర్ అనే గ్రామానికి చెందిన సిత్తు ఓ చమారీ అనే వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. అయితే అతని సెల్‌ఫోన్‌ని ఎవరో కొట్టేశారు. దీనిపై పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నాడు. అయితే సిత్తు చెప్పులు కుట్టేవాడని తెలిసిన పోలీసులు..స్టేషన్‌లో ఉన్న అందరి బూట్లూ పాలిష్ చేస్తేనే కంప్లయింట్ తీసుకుంటామని బెదిరించారు. దాంతో సిత్తు తన గ్రామం వెళ్లి సామాగ్రి తెచ్చి వారందరి బూట్లూ పాలిష్ చేశాడు. పోలీసుల తీరుపై అతని తోటివారు భగ్గుమన్నారు..అంతటితో ఆగకుండా అతని చేత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయించారు. సదరు పోలీసులపై చర్య తీసుకుంటానని జిల్లా ఎస్సీ సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.